చెరువుల అభివృద్ధికి 100 కోట్లు

4

– శిఖం భూముల కబ్జా చేస్తే సహించం

– మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌,డిసెంబర్‌,05(జనంసాక్షి): హైదరాబాద్‌ మహానగరంలోని చెరువుల సుందరీకరణపై మంత్రి హరీష్‌ రావు దృష్టి పెట్టారు. సిటీ లేక్స్‌ పై సవిూక్ష సమావేశం నిర్వహించిన మంత్రి.. ఇప్పటికే ప్రారంభించిన చెరువుల పునరుద్ధరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులను కబ్జా చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ సహాయంతో చెరువులకు సంబంధించిన లీగల్‌ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ 625 చదరపు కిలోవిూటర్ల పరిధిలో 169 చెరువులు ఉన్నాయి. వీటిలో జంట నగరాల పరిధిలో 26 చెరువులు, రంగారెడ్డి జిల్లాలో 133 చెరువులు, మెదక్‌ జిల్లాలో 10 చెరువులు ఉన్నాయి. వీటిని కబ్జాల భారీ నుండి రక్షించి, పునరుద్ధరించి, సుందరీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నగరంలోని చెరువులపై మంత్రి హరీష్‌ రావు సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌ రావుతో పాటు ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు. నగరంలో ప్రారంభించిన చెరువుల పునరుద్ధరణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు. మహానగరం పరిధిలోని 155 చెరువుల సర్వే పూర్తయిందని అధికారులు మంత్రి హరీష్‌ రావు కు తెలిపారు. మిగతా 14 చెరువుల సర్వేను డిఫెన్స్‌, రెవెన్యూ అధికారుల సహకారంతో వచ్చే నెల రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వేలు పూర్తయిన 155 చెరువులకు గాను.. 64 చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, వీటికోసం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. ఈ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 37 చెరువుల పునరుద్ధరణ పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తౌెనట్టు అధికారులు వివరించారు. 14 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మరో 12 చెరువులకు సంబంధించి అగ్రిమెంట్లు పూర్తి చేసుకొని.. పనులు ప్రారంభించే దశలో ఉన్నాయన్నారు. అగ్రిమెంట్లు పూర్తౌెన చెరువుల్లో వారం రోజుల లోపు పనులు ప్రారంభించాలని మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు. టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్న 37 చెరువుల పనులను వేగవంతం చేయాలన్నారు. నగరంలో చెరువులను కబ్జా చేసేవారిపై రాజకీయాలకు అతీతంగా కఠినచర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు. మంజూరైన పనుల్లో ఆలస్యం జరుగుతున్న తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రామంతపూర్‌ లోని చిన్న చెరువు, పెద్ద చెరువును సందర్శించినప్పుడు.. స్థానిక ప్రజలు, గంగపుత్ర సంఘం వారు ఇచ్చిన విజ్ఞప్తులపై సమావేశంలో మంత్రి చర్చించారు. చిన్న చెరువు, పెద్ద చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లను తయారు చేసి పనులను ప్రారంభించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల నిర్మాణానికి అడ్డంకిగా మారిన లీగల్‌ సమస్యలను పరిష్కరించుకొవాలన్నారు. దీనికోసం అడ్వకేట్‌ జనరల్‌ ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఈ విషయంలో సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌ రావు సహాయ సహకారాలు కూడా తీసుకోవాలన్నారు.జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనుల్ని వేగవంతం చేయడంలో భాగంగా కొత్తగా వాట్స్‌ యాప్‌ గ్రూప్‌ ను తయారు చేశారు. యాప్‌ వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.