చేతులు క‌లిపిన వొడాఫోన్‌-ఐడియా

దిల్లీ(జ‌నం సాక్షి): టెలికాం రంగంలో జియో ఓ సంచలనం. జియో రాకతో టారిఫ్‌లు భారీగా తగ్గాయి. అయితే ఈ క్రమంలో కొన్ని టెలికాం కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ఆ సంస్థలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రముఖ సంస్థలైన వొడాఫోన్‌, ఐడియాలు కూడా చేతులు కలిపాయి. ఈ సంస్థల విలీన ప్రక్రియ దాదాపు పూర్తయినట్లే. కానీ దీనికి టెలికాం శాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదు. అయితే వొడాఫోన్‌-ఐడియా విలీనానికి టెలికాం శాఖ సోమవారం ఆమోదముద్ర వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విలీనానికి రేపు ఆమోదముద్ర వేసి.. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వొడాఫోన్‌, ఐడియాలకు అందజేసే అవకాశముందని సదరు వర్గాలు తెలిపాయి.దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించేందుకు వొడాఫోన్‌, ఐడియా చేతులు కలిపాయి. ఒకవేళ ఈ విలీనానికి టెలికాం శాఖ అంగీకరిస్తే వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ కింద తమ కొత్త నెట్‌వర్క్‌ను కొనసాగించనున్నాయి. టెలికాం రంగంలో పోటీ తీవ్రతతో ఐడియా, వొడాఫోన్లు అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు విలీనం బాటపట్టాయి. రెండు కంపెనీలకు కలిపి దాదాపు రూ. 1.15లక్షల కోట్ల మేర అప్పులున్నట్లు అంచనా.వీలినానికి టెలికాం శాఖ రేపు ఆమోదముద్ర వేస్తే.. ఈ నెల 26న ఐడియా సాధారణ సమావేశాన్ని ఏర్పాటుచేయనుంది. అందులో తమ కంపెనీ పేరును మార్చనుంది. ఇక ఈ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌కు కొత్త సీఈవోగా బాలేశ్‌ శర్మ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.