బిసిసిఐ కొత్త ఎత్తుగడ

cricket_india_crest-svgన్యూఢిల్లీ, నవంబర్ 4: దేశంలో క్రికెట్ పాలనా వ్యవహారాలు పారదర్శంగా ఉండేందుకు లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఏ మాత్రం ఇష్టపడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త ఎత్తుగడతో ముందుకు సాగాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతున్నది. ఇంగ్లాండ్‌తో ఈనెల తొమ్మిది నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఖర్చులు చెల్లించే పరిస్థితులో లేమంటూ చేతులెత్తేసింది. ‘మీ ఖర్చులు మీరే భరించుకోండి’ అంటూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)కి లేఖ రాసింది. సిరీస్ ఆడేందుకు దేశంలో అడుగుపెట్టిన జట్టుకు ఖర్చు పెట్టడం సాధ్యం కాదంటూ లోధా కమిటీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. సిరీస్‌కు ముందే ఇసిబితో ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకూ దాని జోలికి వెళ్లకుండా తాత్సారం చేస్తున్నది. లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లోని ఒక రాష్ట్రానికి ఒకే ఓటు.. పాలక మండలి సభ్యులకు వయో పరిమితి.. కూల్ ఆఫ్ పీరియడ్.. వంటి అంశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న బిసిసిఐ ఇప్పుడు ఏకంగా బ్లాక్‌మెయిల్‌కు దిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టుకు ఖర్చులు కూడా చెల్లించలేని దీన స్థితిలో ఉన్నామంటూ, దానికి లోధా కమిటీనే కారణమన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నదన్న వాదన వినిపిస్తున్నది. ఇసిబికి బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే లేఖ రాయడం, ఖర్చులను వారే పెట్టుకోవాలని సూచించడం, అందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం భారత క్రికెట్ పరువు తీయడమే అవుతుందని పలువురి వాదన.
అమీతుమీకి బోర్డు సిద్ధం!