చేనేత వస్త్రాలతో చర్మవ్యాధులు దూరం
చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వాలి
జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్,అగస్టు7(జనంసాక్షి): చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల చర్మ వ్యాధులు రావని, అంతేకాక శరీరాన్ని చల్లగా ఉంచుతాయని మంత్రి అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగాన్ని, కార్మికులను కాపాడాలని, చేనేతలకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న ఎక్స్‌పో ప్లాజాలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చేనేతలకు ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చేనేత వస్త్రాలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. జిల్లా కేంద్రంలో టెస్కో షోరూమ్ తో పాటు బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసే విషయంపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ.. మన వస్త్రాలు మన సంస్కృతికి నిదర్శనమని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని కోరుతూ కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎక్స్ పో ఎª`లాజా నుండి తెలంగాణ చౌరస్తా వరకు చేనేత కార్మికులతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ ఉపాధ్యక్షులు వెంకటయ్య, చేనేత శాఖ సహాయ సంచాలకులు బాబు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కృష్ణ మోహన్, చేనేత సంఘాల అధ్యక్షులు లక్ష్మీ నారాయణ, రాములు, కృష్ణయ్య,తదితరులు పాల్గొన్నారు .