చేనేత హస్తకళ ఓ అద్భుత కళ


అగ్గిపెట్టలో చీరను పట్టేలా చేసిన ఘనత వారిదే
నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలా అండ
చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత హస్తకళ అద్భుత కళ అని అది నేతన్నలకే సాధ్యమయ్యిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన గొప్ప కళాకారులు చేనేతలని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమాజానికి సంస్కృతిని నేర్పిన నేర్పరులు నేతన్నలని పేర్కొన్నారు. గతంలో ప్రజలకు చేతితో నేసిన వస్త్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవని, అయితే క్రమంగా యంత్రాలు ప్రవేశించా యన్నారు. దీంతో చేనేత కార్మికులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వారు నేసిన వస్త్రాలకు ఆదరణ తగ్గిపోవడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ చేనేత కార్మికులను ఆదుకోవడానికి అనేక పథకాలను ప్రవేశ పెట్టారని వెల్లడిరచారు. బతుకమ్మ పండుగ, రంజాన్‌, క్రిస్మస్‌ పర్వదినాల సందర్భంగా ప్రభుత్వం చేనేత బట్టలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. చేనేతలకు మౌలిక, మార్కెటింగ్‌ వంటి సదుపాయాలు, సబ్సిడీలు కల్పిస్తున్నదని చెప్పారు. నిరుపేద చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారన్నారు. రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని నేత కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పారు. సిరిసిల్ల అంటే..ఉరి సిల్ల అని విూడియాలో ఒకప్పుడు తాటికాయంత అక్షరాలతో వార్తలు ప్రచురించేవన్నారు. అయితే మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన తర్వాత.. సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారిందని తెలపారు. తన సొంత నియోజకవర్గమైన పాలకుర్తిలో కూడా చేనేత కుటుంబాలు అధికంగా ఉన్నాయని వెల్లడిరచారు. వారందరినీ ఆదుకుం టామని,వారికి పూర్వ వైభవం తెచ్చేలా సిఎం కెసిఆర్‌ గట్టిగా కృషి చేస్తున్నారని అన్నారు.