చేపల చెరువులతో తగ్గుతున్న వరిసాగు 

ఏలూరు,మే28(జ‌నం సాక్షి): జూన్‌ 1న పంట కాలువలకు నీరు విడుదల చేస్తామని వ్యవసాయాధికారి అన్నారు. సీలేరు నుంచి ఏడు టీఎంసీల నీటిని తీసుకొచ్చి శివారుప్రాంతాలకు సైతం అందేవిధంగా  చర్యలు తీసుకుంటామని అన్నారు. గతేడాదితో పోలిస్తే  వరిసాగు తగ్గిందన్నారు. చేపల చెరువులు తవ్వడం, నష్టాల కారణంగా పొగాకు, చెరకు రైతులు ఆయిల్‌పాం పంటవైపు మొగ్గుచూపడం, భూసేకరణ, స్థిరాస్తి వ్యాపారం తదితర కారణాలవల్ల ఈ మార్పులు చోటుచేసు కున్నాయని వివరించారు. రైతులు ముందస్తు వరిసాగుకు సిద్ధం కావాలని జేడీఏ కోరారు. స్థానిక భూసార పరీక్షా కేంద్రాన్ని  ఆమె సందర్శించారు. మట్టి నమూనా పరీక్షలను స్వయంగా పరిశీలించి త్వరితగతిన పరీక్షలు పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ ఏడాది 38,188 మట్టినమూనాలను పరీక్షించి 54 వేల మంది రైతులకు భూసారపరీక్షా ఫలితాలను అందజేయాలనేది లక్ష్యమన్నారు. ఇప్పటివరకు 35,250 రైతులకు సంబంధించిన భూసారపరీక్షా ఫలితాలను ఆన్‌లైన్లో నమోదు చేసి 28 వేలమందికి భూసారపరీక్షా విశ్లేషణ పత్రాలను అందజేశామని వివరించారు. ఏపీ సీడ్స్‌, డీలర్ల వద్ద పూర్తిస్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సొసైటీల వద్ద 190 టన్నుల జింక్‌, 1200 టన్నుల జిప్సమ్‌, 2.75 టన్నుల బోరాన్‌ను రాయితీపై రైతులకు అందుబాటులో ఉంచామన్నారు.