చేయూతనిస్తే స్కూళ్లకు వెలుగు
మహబూబ్‌నగర్,జూన్8(జనం సాక్షి):విద్యాలయాలను బాగు చేయడానికి సర్కారు ఏటా కోట్లు వెచ్చిస్తున్నా.. ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ అరకొర వసతులే దర్శనిమిస్తున్నాయి. ఆడపిల్లలు మూత్రశాలలు లేకుండా ఇబ్బంది పడుతున్న స్కూళ్లు ఎన్నో ఉన్నాయి. అందుకే సర్కార్ స్కూళ్లకు పంపాలంటేనే జంకుతున్నారు. ఈ దశలో ప్రైవేట్‌కు దీటుగా కొన్నిచోట్ల దాతల సహకారంతో స్కూళ్లు బాగుపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వీరంతా తమ గ్రామాల్లో ఉన్న స్కూళ్లకు ఆసరాగా నిలిస్తే అవి బాగుపడుతాయి. ఎప్పటి లాగే చిన్నారులకుకష్టాలు స్వాగతం పలకబోతున్నాయి. ఊళ్లొని బడిని బాగు చేసుకోవాలంటే….విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు చేయూత అందించాలి. సర్కారీ బడిలో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు ఇందుకు ముందుకు రావాల్సి ఉంది. తాగునీటి వసతి కల్పనపై దృష్టి కేంద్రీకరించాలి. దప్పిక వేసిందంటే చాలు విద్యార్థులు ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. కొందరు నీళ్ల సీసాలు పట్టుకొస్తున్నారు. బల్లలుల్లేని బడులకు కొదవేలేదు. చాలా చోట్ల కిందనే కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారు. నేల చదువులతో ఏకాగ్రత దెబ్బతింటోంది. కొందరైనా స్పందిస్తే బల్లల కొరత తీర్చడం కష్టమైన పనేవిూ కాదు. ఇకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో ఆట స్థలాలు ఉన్నా, క్రీడా పరికరాలు లేవు. వాటిని సమకూర్చడానికి దాతలు ముందుకొస్తే గ్రామంలో క్రీడాభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.