చోటీ బహెన్
(శుక్రవారం తరువాయి భాగం తరువాత)
నిఖా, దావత్ అయిపొయ్‌నయ్.
ఎక్కడి వాళ్లక్కడ ఆరాం చేసిన్రు. పొద్దుగూకంగా దుల్హా, దుల్హన్ ఒక రికొకర్ని చూపెట్టే జల్వా అయిపోంగనే ఇగ దుల్హేవాలే బయల్దేరే హ డావుడి చెయ్యబట్టిన్రు. లోపలి అర్రల మా జానిబేగం ఏడుపు బిగ్గ రగా విన్పిస్తున్నది. నాకేదో ఉన్నకాడ కాలు నిలువకుంట అయి అటు ఇటు తిరుగుతున్న. ఆఖరికి ఉండబట్టలేక చెల్లె దగ్గర కూల బడి చెల్లెను గుండెలకు హత్తుకున్న, దుక్కం ఆపుకోలేకపోయ్‌న. మా చెల్లె ‘మేరే బాబ్భాయ్..’ అంటూ పెద్ద పెట్టున ఏడుస్తున్నది. మా భా య్ బహెన్‌లను చూసి అమ్మి, నానిమా, మామిజాన్‌లు, ఖలాలు, చిచానీలు, చుట్టాలంతా కళ్లనీళ్లు పెట్టుకున్నరు. అంతల దూరపు మామి ఒకామె ‘ఓ పిలగా! నువ్వు అట్లేడిస్తే ఎట్ల? చెల్లె ఇంకా గుండె బగులుతది.. లే’ అనుకుంట నా జబ్బ పట్టి లేపబోయింది. నేను వి దుల్చుకున్న.. మేమట్ల ఏడుస్తుంటే ఇల్లంతా ఏడుపులతో దద్ద రిల్లిపొయింది., ఎందరు ఓదార్చబోయినా ఆగక గుండెలవిసేలా ఏడుస్తున్నం. ఇది గమనించి బైట ఎవరో అంటె, మా నడిపి మామ లోపలికొచ్చి –
‘ఓ బచ్చే! ఆడపిల్లలెక్క అట్ల ఏడుస్తున్నవేంది. లే.. బైటికి పా నువ్వు. బైట శానా పనుందింక. ఆ సామానంతా సర్వీసులకు ఎక్కియ్యాలె, నడువ్..’ అనుకుంట బైటికి లాక్కుపొయ్యినంత పనిజేసిండు.
ఇగ అక్కడ్నించి సామానంత దులేవాలె చూసుకొని, బస్ సర్వీసు పైకి కొంత, లోపల కొంత ఎక్కించిందాన్క మా చెల్లె ఇంట్ల ఒక్కొక్కర్ని పట్టుకొని ఏడుస్తనె ఉంది. సామాను ఎక్కియడంల సాయపడ్తున్ననన్న మాటేగాని చెల్లె ఎళ్లిపోతుందని తలపుకొచ్చిన ప్పుడల్లా నా కళ్లు ఉబుకుతున్నయ్…చీకటి పడ్డది, లైట్లు ఎలిగినయ్, కాని మా ఇంటోళ్ల ఒం ట్లోని జీవకణాలన్ని ఒక్కటొక్కటిగ ఆరిపో తున్నట్లనిపించింది. చెల్లెను మెల్లగ సర్వీసు దగ్గర్కి నడిపించుకుంట తీసుకొస్తున్నరు. ఒక్కొక్కర్కి ఏడ్పుతో వీడ్కోలు చెబుతున్నది చెల్లె. మద్యల, అంతసేపు దూరం దూరంగ మనసు ఉగ్గబట్టుకొని తిరగా డిన మా అబ్బా చెల్లె దగ్గరకి రాంగనే కదిలిపోయిండు. మా అబ్బాని హత్తుకొని మరింత ఏడ్చింది చెల్లె. మా అబ్బ కూడ ఏడుస్తున్నడు, మేమింతంత పెద్దగయినం గనీ మా అబ్బా ఏడ్వంగ ఎన్నడూ చూడలె.దూలెవాలె తరపొకాయన చిరాగ్గా ‘జల్ది నడిపించాలె, మల్ల మాకు లేటైపోతది’ అన్నడు. మా అబ్బను వదిల్చి ముందుకు కది ల్చిన్రు చెల్లెను. అందరు ఏడుస్తున్నరు. చిన్నపిల్లలంతా గూడ ఒకటే ఏడుస్తున్నరు. ఇంటి సుట్టుపక్కటోల్లు, ఊరోళ్లు కొంతమంది కళ్లనీ ళ్లు పెట్టుకుంటున్నరు.మా అమ్మీ ఐతే శవమైపొయ్యింది, ఏడ్చి ఏడ్చి కళ్లు పీక్కుపోయి ముఖం వాడిపొయ్యింది. చేత్తో కొంగును నోట ికడ్డం పె ట్టుకొని నడవలేకపోతుంటే మా మామి ఒకామె అమ్మిని పట్టుకొని నడుస్తున్నది.
చెల్లె సర్వీసు మెట్టు ఎక్కబోతున్న ఘడియల అక్కడి వాతావరణమంతా బీభత్సంగ తయారయ్యింది…
ఆ ఏడ్పులు.. ఓదార్పులు.. జాగ్రత్తలు… హామీల నడు మ కదల్లేక, కదల రాక, అందర్నీ జరుపుకుంట భారంగ కదిలి ఎళ్లి పొయింది సర్వీసు…
ఆ రాత్రి ఎంతకూ నిద్రపడ్తలేదు నాకు. పండుకుంటాన్కి జాగలేక కిరాయికి తెచ్చిన రెండు టేబుళ్లు దగ్గర్గ అనుకొని పండు కున్న. కింద ఏసుకుంటాన్కి, తల కిందకు, కప్పుకుంటాన్కి ఏమీ లెవ్వు. అటు మళ్లి చూసినా ఇటు మళ్లినా నిద్ర పడ్తలేదు. ఏడుస్తున్న చెల్లె రూపమే కదుల్తున్నది కళ్లల్ల.. చెల్లె ఎళ్లిపోయింది… నేనెత్తుకొని ఆడించిన నా చిన్న చెల్లె.. నా మాటల్నీ, నా చేతల్నీ ఎప్పుడూ స పోర్టు చేస్తుండే ‘నా చెల్లె’… ఇంట్ల సందడి సందడిగ తిరగాడె చెల్లె.. రేపట్నుంచి ఇల్లు మూగబోదూ.. అత్తగారింట్ల ఎన్ని గొడవలు పడ తదో.. భాయ్‌జాన్ (బావ) చెల్లెని మంచిగ చూస్తడో లేదో.. చూడ్డాన్కి మంచోనిగనె అన్పిస్తున్నడు, గని మనసెలాంటిదో ఏమో.. అసలు చెల్లెకు భాయిజాన్ నచ్చుతడా?! షాదికి ముందు ఒకర్నొకరు చూసుకోనియ్యకపోవడం ఏం బాగలె, ప్చ్… అసహనంగా టేబుళ్ల మీద కదిలిన. ఎక్కడివాళ్లక్కడ నిద్రపోతున్నరు. బల్లెపీట మీద ఒరిగిన అబ్బా లేచి కూర్చొని సిగరెట్ వెలిగిచ్చిండు. ఆ వాతావ రణమంతా స్మశానంలా తోస్తున్నది నాకు. ఆ స్మశాన నిశ్వబ్దంలోంచి సన్నగా అమ్మీ ఏడుపు విన్పిస్తున్నది…
రెండో రోజు వలీమా. ఎంతమంది వస్తరని దూలెవాలె అడిగితే యాభైమందిమి వస్తమని మావోళ్లు చెప్పిన్రట. మజ్యానానికి బయలెల్లివెళ్తెనే చీకటి పడేసరికి మా చెల్లె అత్తగారోళ్లూరు చేరు కోవచ్చు.పొద్దున మొఖాలు కడిగి చాయిలు తాగి ఇంకొంచెం సేపట్కి రాత్రి దావత్‌ల మిగిలిన బగార అన్నం, ‘దాల్చ’తోని అంతా తిన్నరు. ఇగ వాపస్ చెస్తాన్కి వంట చేసిన డేగిసలు, బగోనాలు, వ గారా అన్నీ కడగడం ఒకవైపు, టెంట్లు విప్పడం మరోవైపు ఐతు న్నయ్.అంతల్నె బావ బామ్మర్దుల, బావమరదళ్ళ వరసున్న వాళ్ళు ‘చాథీ’ ఆడటం షురూ ఐంది. ఓఫ్…. నీల్లు గుప్పడం. మసి పూయ డం. బురదల దొర్లించడం, ఉరుకులు పరుగులు… గడ్‌బడ్ గడ్‌బడై పొయ్యింది ఇంటి ముందలి వాతావరణమంతా… మడత కుర్చీలు లెక్కబెడుతూ ఒక పక్కన పెట్టిస్తున్న నన్ను మా బావ ఎనక నుంచి వచ్చి అమాంతం ఎత్తుకుపోయి గాబుల ముంచిండు. మా తమ్ము డు ఉరుకొచ్చి మా బావ మొకం నిండ పెంక మసి పూసిండు. ఇటు మా అమ్మ – ఆమె మదరల్ళు ఆడుతున్నరు. మా మామలు మా నాయ్నను రంగు రంగు చేసిన్రు మా చిన్నమ్మల భర్తలు మా నాయ్నకు తోడు కలిసి మా మామల్ని ఉరికించిన్రు. మద్యాన్నం దాంక ఇంటి ముందంతా ఒకటే గడ్‌బడ్…. నవ్వులు, ఆరపులు, జోకులు…
టెంట్ సామాన్, వంట సామాన్ అంతా వాపస్ చెయ్యడం చిల్లమల్లర పనులు షానా ఉండేసరికి నాకు వలీమా కెళ్లడం కుదరలేదు. నేను రాకపో తుండేసరికి నా దోస్తులు కొంతమంది మాను కున్నరు. అప్పటికి కొందర్ని ఎళ్లిరమ్మని పంపిం చిన. ఆళ్లు నారాజ్ గనే పొయ్యిన్రు.టాక్టర్ కటు ్టకొని ఎళ్లిన మావోళ్లు రాత్రి ఒంటి గంట దాటి నంక గని రాలే. చెల్లె బావ ఆళ్ళెంట రావె. ఫస్టు జుమ్మాగి ఆయ్‌పొయ్‌నంక పంపిస్తుమన్నరంట. చెల్లె నన్ను బాగ అడిగిందని, నేను రాలేదని ఏ డ్చించి చెపిన్రంత. అసలు ఈళ్ళు పోంగానె ‘బాబ్భయ్‌కాం? బాబ్భాయ్ నయ్?’ అని ఒకటే అడిగిందట నాకు షానా దుక్కమనిపించింది.ఆ ఆర్రోజులు చెల్లె బాగ గుర్చొచ్చింది. జుమ్మా రోజు నాకు తెల్వకుంటనే ఆత్రమాత్రంగా తయారై చెల్లె వాల్ల ఊరికి బయల్దేరిన.ఆళ్ల ఊరికి పొద్దునొకటి, పొద్దు గూకాలొకటి రెండే బస్సులు. నేను బోయిం ది పొద్దుటి బస్సుకె. ఆళ్ళూర్ల దిగి మా బావ పేరు, ఆళ్ళ నాయన్నపేరు అడుక్కుంట నాలుగైదు సందులు తిరిగి ఆళ్లింటికి చేరిన.బైటి తలుపు దగ్గర్కేసి ఉంది. తోసుకొని కడుగు పెట్టిన. లోపల శానఖుల్ల జాగ ఉన్నది. నాకు మొట్టమొదలు కనిపిం చింది మా చెల్లెనె. తలుపుకు ఎండంపక్క గవాషి కాడ గంపెడు అంట్ల గిన్నెలేసుకొని తోముతున్నది. మా ఇంట్ల మా చెల్లె ఒక్కపాలె అన్ని గిన్నెలు ముందలేసుకొని తోమడం నేను ఎన్నడూ చూడలె… అదిగాక పెండ్లికల గూడ పోకముందే! నేనట్లనే నిలబడిపొయ్‌న.
భాయ్‌జాన్ ఏడని అడిగిన. ఊర్లకెళ్లిండని చెప్పింది చెల్లె.
అంతల్నె లోపల ఆర్రల్నుంచి చెల్లె అత్త బైటికొచ్చింది. సలామ్ చెప్పు కుంట అటు కదిల్న. చెల్లె జల్ది జల్ది సాయ్‌మాన్లకెళ్ళి గోడకు నిలబెట్టి ఉన్న నులకమంచం ఏసింది. పుప్పమ్మ (అత్త) బాగోగులు అడుగు తుంటె చెప్పుకుంట మంచంల కూసున్న ఎడంపక్క అర్రల్నుంచి చెల్లె మామ, ఆడిబిడ్డలు ఇంక కొందరు సుట్టాలు బైటికొచిన్రు. అందరికి సలామ్ చెప్పిన. ఆళ్ళు అడిందానికల్లా జవాబు చెప్తున్న నవ్వు ము ఖం తోటి చెల్లి నా పక్కనె నిలబడింది. కొంచెమాగి, ‘మూ హాత్ ధోలెన్ బా’ అన్నడు పుప్ప (మామ) నేను లేషిన. చెల్లె లోపలికెళ్ళి తువాల, సబ్బు తెచ్చింది. గవాషి కాడ మొహం కాల్లు చేతులు కడు క్కొని వచ్చిన. చెల్లె మంచినీళ్లు తెచ్చినంతల ‘ఇదర్ ఆవ్ బా’ ఆర్ర లకు పిలిచింది పుప్పమ్మ. ఎందుకో సమజ్ కాకున్న ఎల్లిన. ఆ ఆర్ర దాటుకొని అవతలకి పొయ్యిన. దాన్ని ఆనుకొని కొద్ది గెత్తుమీద హమామ్ ఉన్నది. హమామ్ ఓపెన్ అర్రలాగుండి దానిమీదికి మల ె్లతీగ గుబురుగ పాకి అందంగ, నీడ పడుతున్నది. పొయ్యి ఆర్రమీద కమ్మల కప్పు కమ్మల కప్పు అటుబైటి సందులకు దించి ఉన్నది. దాంతో అవతలి పక్క త్రికోనాకారంల గోడలేకుండ ఖాళీగ ఉండి మంచి వెల్తురు పడ్తున్నది. ఆ గోడకె పొయ్యున్నది నాకు శానా బాగనిపించింది, అట్ల ఉండటం.ఆ పొయ్యర్రల సాప ఏసి.. ఉన్నది. పక్కన పెద్ద లొట్టిల కల్లు.. ఇంకొక ఖాళీ లొట్టిడూడ ఉన్నది అప్పు డర్థమైంది నాకు. అంతకుముంది లోపలాళ్లంత ఏం జుస్తున్నరో… కూసోమన్నది పుప్పమ్మ. పొయ్ మీది ముంతల్నుంచి ఉల్వ గుగ్గిల్లు ఒక గిన్నెల ఏసి నా దగ్గుర పెట్టింది. పుప్ప లోపలికొచ్చి నా పక్కన కూసొని స్టీలు గిలాస్‌ల కల్లొంచి ఇచ్చిండు. తాగిన మంచి కల్లు. ఇంకో గిలాస తాగి. మల్ల ఒంపబోతె జర ఆగి తాగుతనని చెప్పి, గుగ్గిర తీసుకున్న. కారం ఉప్పు కలిపి మస్తు రుచిగున్నయ్.
పుప్పా పుప్పమ్మ అదో ఇదో అడుగుతు మాట్లాడుతున్నరు. చెల్లి ఒచ్చి ‘అమ్మి కైసె హై బాబ్భాయ్’ అన్నది ‘బాగనె ఉన్న’ దన్న పక్కన కూసుందువు రమ్మంటె ఒస్తలె. ఆళ్లత్త కూసొ మన్నంక కూసుంది. చెల్లె ఒద్దంటున్నా పుప్ప ఒక గిలాసు కల్లు చెల్లెగ్గూడ ఒంపి ఇచ్చిండు కష్టంగ రెండుసార్లకు తాగింది ‘కొద్దిసేపుండి లేషి ఎళ్ళిపొయింది. నేను శానాసేపే కూసొని మట్టాడుకుంట ఇంకో నాలుగ్లాసులు తాగిన ఆణ్నించి లేసినంక జుమ్మాగికి చేసే ‘బిచిడీ-ఖట్ట’ పాపడ్ తోని తిని కీర్ తాగిన, సాయమాన్ల నులక మంచంల పండుకున్న.
పొద్దుగూకాల మెలకువచ్చేసరికి భాయ్ జాన్ వొచ్చి ఉన్నడు. ఊర్లకు తీసుకుపొయ్యిండు. ఆల్ల దోస్తులను ములాఖత్ చేసిండు. అంతా కొద్దోగొప్పో చదివి ఎవసాయం చేసుకుంటున్నోళ్ళ్లు. కొద్దిసేపు మా ట్లాడినంక ఒక గౌండ్లింటికి తీసుకెళ్ళ్నిఉ. మాతో వొచ్చిన భాయ్‌జాన్ దోస్తులిద్దరు. మా ఇద్దర్కి కలిపి ముందు పన్నెండు షేర్ల లొట్టి తీసు కుండు భాయ్‌జాన్. భాయ్‌జాన్ దోస్తులిద్దర్ల ఒకాయన సూదరాయ నని, ఇంకొకతను మాదిగాయన అని మాటల్ని బట్టి అర్థమైంది.
మా ఇద్దర్కి ఉన్న రెండు గ్లాసులిచ్చి ఆళ్ళిద్దర్కి మోదుగాకుల్ల కల్లొంవుతున్నడు గౌండ్లాయన, నేను సదువుకున్నోన్నని ఎర్రబుర్ర గుండి పాంట్ షట్ ఏసేటోనన్ని షానా విలువిచ్చి మాట్లాడు తున్నట్లనిపించ్చింది ఆళ్లంత. తాగే అలవాటు ఎక్కువగా లేక నేను తక్కువే తాగిన ఆళ్ళు మాత్రం మల్లొక నాలుగు షేర్లు లొట్టి తీసు కున్నారు.బాగ చీకటి బడ్డంక ఇంటికొచ్చినం. చెల్లె బాట చూస్తు న్నది. నాటుకొడి కూరతోని అందరం అన్నం తిన్నం. నేను సాయ మాన్లనె పండుకుంటునంటె అక్కణ్ణె పక్కేసిన్రు. పుప్పా, పుప్పమ్మ, చెల్లె ఆడిబిడ్డలు, చుట్టాలు, పిల్లలు, నన్ను కొంచెం డిస్ట్రబ్ చేసిన ఆ చుట్టాల్లోని ఒక అందమైన పిల్ల-అంతా వసారాల పండుకున్నరు.
చెల్లె నా మంచం కింద చెంబుల నీళ్ళు తెచ్చిపెట్టింది. ‘ఇంకేమన్నా కావాలంటె అడుగు బాబ్భాయ్’ అని కొద్దిసేపు మాట్టాడి లోపలి కెళ్ళింది గని చెల్లె మనసంత నా చుట్టె తిరుగుతుందని నాకు తెలుసు, నేన్ యాడికీ పొయ్యేటోన్ని కాదని, యాడికి పొయ్‌నా రాత్రి ఆస్సలు ఉండనని చెల్లెకి తెలుసు.
ఆలోచించుకుంట ఒరిగిన. సగం సాయ్‌మాన్ కిందికి సగం బైటికి ఉన్నది మంచం.
ఆకాశం చంద్రుని వెలుగు, చుక్కలు కొత్త వాతావరనంల కొత్తగని పిస్తున్నయ్. బైట ఎనుగెంట ఉన్న యాప చెట్లు గాలికి కమ్మని సప్పుడు చేస్తన్నయ్. ఆ పల్లెటూరి గాలికి, కల్లు మత్తుకి మెత్తగా నిద్రలోకి ఒరిగిపోయ్‌న.పొద్దున లేషేసరికి చెల్లె వాకిలి ఊకుతు న్నది. షానా పెద్ద ఆకిలి. అదంతా ఊకి మల్ల లోపలున్న ఖాళీ జాగా అంతా ఊకింది. నేను బైటికి వొచ్చి నిలబడి యాపచెట్ల దిక్కు చూ స్తున్న పుల్లకోసం. అంతల్నె బాయికాడికెల్లి వొచ్చిన పుప్ప నోట్ల యా పుల్లేసుకొనిచ్చి చేతిలున్న రొండు పుల్లలు నాకెల్లి సాపిండు. మోతాదుది తీసుకొని ఏసుకున్న.మొకం కడుక్కొని అన్నం గిట్ల తిన్నం. జల్ది జల్ది పనంత ముగించుకొని మా చెల్లె తయారై పొ య్యింది. భాయ్‌జాన్ని తొందరపెట్టడం నాకు విన్ఫిస్తనే ఉన్నది. సూ ట్‌కేసు, ఒక బ్యాగు తెచ్చి సాయ్ మాన్‌ల పెట్టింది. భాయ్‌జాన్ కొత్త ప్యాంట్ షట్ తొడుక్కుని ఒచ్చిండు. నేను సూట్‌కేస్ తీసుకున్న చెల్లె కొత్త చీరల నిండుగ అన్పిస్తున్నది. భాయ్‌జాన్ పటుకున్న బ్యాగ్‌ల ఏందో తీసుకొచ్చి పెట్టి మల్లా లోపల్కి పొయింది. నేను పుప్పమ్మకు, పుప్పకు పొయ్యొస్తనని చెప్పిన. మేం గూడ బస్సుదాంక వొస్తున్న మన్నరు. మిగతా ఆళ్లందర్కి చెప్పి కదిలిన. ఆ- నన్ను డిస్ట్రబ్ చేసిన చుట్టాల పిల్ల చూపు, అందమైన నవ్వు మనసుల ముద్రించుకు పొయ్‌నయ్.’బస్సు సప్పుడైతున్నంట్లుంది తొందర్గ రా జానిబేగం’ అన్నడు భాయ్‌జాన్. పొద్దుటి బస్సెళ్ళిపోతే మల్ల నాలుగ్గంటలకె ఇ. ఆ భయమయ్య చెల్లె ఎందుకు లేట్ చేస్తుందా అన్న విసుగుతోని నేను ఎనక్కు మల్లిన. చెల్లె బైటికొచ్చింది. నేనేం చూస్తున్ననో నాక ర్థం కాలె. అట్లనే నిలబడిపొయ్‌న. నిండు బుర్ఖాలో మా చెల్లె….! ఆ బుర్ఖా వెయ్యనంటె వెయ్యననే కదా నా చెల్లె దాదాపు పదేళ్ళు అన్న న్ని తిట్లు తిన్నది…. నా కళ్ళల్ల నీళ్ళు గిర్రున సుడులు తిరుగు తున్నాయ్… నేనేం ఆలోచిస్తున్నవో సమజైన నా చెల్లె కళ్ళపొంట నా రూపం బొటబొటా రాలుతున్నది.
– స్కైబాబ
అధూరె నుంచి