అధిక వడ్డీలతో అభివృద్ధి కుంటుపడుతోంది
` మౌళిక సదుపాయాలను కల్పించడంలో ముందున్నాం
` కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించుకున్నప్పుడే అభివృద్ధి
` ‘యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం
` పారిశ్రామిక రంగంతోపాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు
` ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్టానికి కంపెనీలు వస్తాయి
` ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌ను అనుసంధానిస్తూ రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నాం
` ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్.మహేంద్రదేవ్ సీఎం రేవంత్‌రెడ్డి భేటి
హైదరాబాద్(జనంసాక్షి): సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకున్నప్పుడే.. అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్.మహేంద్రదేవ్ శనివారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినట్లు సీఎం వివరించారు.‘‘యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతోపాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్టానికి కంపెనీలు వస్తాయి. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్, ఆర్‌ఆర్‌ఆర్‌ను ఔటర్‌తో అనుసంధానిస్తూ రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వడ్డీల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని.. తిరిగి చెల్లింపులు కష్టమవుతున్నాయన్నారు. వడ్డీలు చెల్లించడానికే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. రుణాలపై వడ్డీలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.
నేడు ఉజ్జయిని మహంకాళి బోనాలు
` భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
` పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు- పూర్తి చేశారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి బోనాలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాల్రు సమర్పించనున్నారు. లక్షలాదిమంది భక్తులు తరలి వచ్చే అవకాశంతో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటోంది. ఆదివారం మహంకాళి బోనాలకు ఉదయం 4.10 బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. సోమవారం రోజు రంగం భవిష్యవాణితో పాటు- అమ్మవారి అంబారి ఊరేగింపు, ఆదివారంరాత్రి, సోమవారం రాత్రి అమ్మవారి ఫలహర బండ్ల ఊరేగింపు ఉంటుంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం 6 క్యూలైన్ లు ఏర్పాటు- చేశారు భక్తులు. బాట షోరూం నుంచి 2 , రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ నుంచి 2, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 క్యూలైన్లు ఉన్నాయి. క్యూ లైన్ లో 16 విూటర్లకు ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు- చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు 70 సీసీటీ-వి కెమెరాల నడుమ బోనాల జాతర జరగనుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా, మొబైల్ వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఉదయం వేళల్లో రద్దీ ఉంటుంది కాబట్టి జోగినిలు, శివశక్తులకు దర్శనం చేసుకునేందుకు స్పెషల్ టైం కేటాయించారు. శివ శక్తులు, జోగినిల కోసం మధ్యాహ్నం 2గంటల నుంచి 4 గంటల వరకు సమయం కేటాయించారు.