కవితమ్మా.. నీది ఏ పార్టీ?

` టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రశ్న
` ఆమె ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా?
` ఆమె మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది
` బీసీలకు రిజర్వేషన్లు.. కాంగ్రెస్‌ హయాంలో విప్లవాత్మక నిర్ణయం
` దీన్ని అభినందించేందుకు కూడా కేసీఆర్‌కు మనసు రావడం లేదు
` కడుపునిండా విషం పెట్టుకొని కౌగిలించుకొన్నట్లుగా విపక్షాల ధోరణి
` గతంలో బీఆర్‌ఎస్‌ బీజేపీకి అన్ని బిల్లులకు మద్దతిచ్చిందని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. కీలకమైన ఈ నిర్ణయాలను అభినందించేందుకు కూడా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు మనసు రావడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో మాట్లాడిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌.. విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. బీసీలకు మేలు జరిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్‌ నోరు విప్పడం లేదు. కడుపునిండా విషం పెట్టుకొని కౌగిలించుకొన్నట్లుగా విపక్షాల ధోరణి ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఏనాడూ దృష్టి పెట్టలేదు. మేం సాధించిన రిజర్వేషన్ల పెంపును.. కవిత తన విజయంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు పక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైలులో ఉన్నారు. తిహాడ్‌ జైలులో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలి. ఆమె మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది. కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా? అని ఎద్దేవా చేశారు. ఇదిలావుంటే మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా ఎందుకు మార్చారో భారత రాష్ట్ర సమితి నేతలు చెప్పాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. చర్చకు రాకుండా సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. నీటిపారుదల శాఖ గురించి తాము మాట్లాడుతుంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగాఎమ్మెల్సీ కవితపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మహేష్‌ గౌడ్‌, ‘‘బీఆర్‌ఎస్‌లో దెయ్యాల పీడ ఉందా? లేక దెయ్యాలే పనిచేస్తున్నాయా? కవిత సూటిగా చెప్పాలి. ఆమె ఏ పార్టీకి చెందినవారో ప్రజలకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్‌ ప్రకటించిన రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘రంగులు, వేషాలు మార్చినంత మాత్రాన పిల్లి పులి కావదు. బీఆర్‌ఎస్‌లో నైతికత ఉండి ఉంటే, కవిత ఇప్పటివరకు రాజీనామా చేసి ఉండాల్సింది. కాంగ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన సమయంలో ఆమె లిక్కర్‌ స్కామ్‌ ఊసులు లెక్కపెడుతున్నారు’’ అంటూ ఆమె తీరుపై సెటైర్లు వేసారు. బిఆర్‌ఎస్‌ హయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపిందని కవితకు గుర్తు చేశారు.బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వకుండా అగ్రవర్ణ వ్యక్తికి కట్టబెట్టినప్పుడే ఆ పార్టీ చిత్త శుద్ధి తేలిపోయింది. బీసీలు ఇప్పుడు వారి వాటా వారు అడిగే స్థాయికి వచ్చారు’’ అని చెప్పారు.కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదని స్పష్టం చేసిన మహేష్‌ గౌడ్‌, ‘‘బీసీ రిజర్వేషన్లు సాధ్యం చేసింది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. ఈ విజయాన్ని సాధించేందుకు రాహుల్‌ గాంధీ ఆశయమే ప్రధాన కారణం. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ మా చాంపియన్‌, మా హీరో రాహుల్‌ గాంధీ. మేమంతా రాహుల్‌ సైనికులం’’ అంటూ అభిమానం వ్యక్తం చేశారు. ఇక ఎవరు దొంగలు? ఎవరు హీరోలు? అన్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలుకు తాము ఎంతగా కట్టుబడి ఉన్నామో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు.