దశాబ్దాల కాలంపాటు కేసుల విచారణ దురదృష్టకరం

` ఏఐ వల్ల అనుకూల,ప్రతికూల ఫలితాలు
` న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడుకున్నది
` చేసే వృత్తిని, చేసే పనిని ప్రేమించగలగాలి
` కోర్టు తీర్పులపై సమగ్ర అవగాహనతో ఉండాలి
` నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):న్యాయవాద వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. వృత్తిని, చేసే పనిని ప్రేమించాలి. అప్పుడే సరైన ఫలితాలు పొందగలుగుతాం. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కొన్ని కేసుల విచారణ దశాబ్దాల పాటు సాగటం ఆందోళనకరం అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్‌ లా యూనివర్సిటీ-లో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ నల్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్‌ సుజయ్‌పాల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ మాట్లాడుతూ..న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాల్సి ఉందన్నారు. కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం న్యాయవాద విద్యలో ప్రవేశించే వారి సంఖ్య పెరుగుతోంది. ఏఐ, డేటా ప్రైవసీ విషయంలో అనుకూల, ప్రతికూల ప్రయోజనాలు ఉన్నాయి. సరైన మార్గదర్శకత్వం ఉంటేనే.. నైపుణ్యం సాధించగలమన్నారు.మెంటార్‌షిప్‌ను ఒక బాధ్యతగా భావించాలన్నారు. జస్టిస్‌ గవాయ్‌ తన ప్రసంగంలో యువ న్యాయవాదులకు, న్యాయ రంగ ప్రవేశిస్తున్న విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. నేటి ప్రపంచంలో న్యాయవ్యవస్థ ముందున్న సవాళ్లను గుర్తు చేసిన ఆయన, మన దేశం వివిధ లీగల్‌ ఛాలెంజెస్‌ను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో, న్యాయవాదులు, న్యాయ సేవలో ఉన్న వారు ’ఎవరేం చెబుతున్నారు’ అనే విషయాన్ని క్షుణ్ణంగా వినడం చాలా ముఖ్యం అన్నారు. న్యాయవ్యవస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే సమయం ఆసన్నమైంది. సరైన పద్ధతిలో దాన్ని వినియోగించుకుంటే, ఇది తీర్పులను వేగంగా ఇవ్వడంలో దోహదపడుతుందని సీజేఐ పేర్కొన్నారు. విద్యార్థులు, వారి కుటుంబాలు విదేశీ డిగ్రీల కోసం ఆర్థికంగా భారమవ్వకూడదని హెచ్చరించిన ఆయన, మన దేశంలోనే నాణ్యమైన న్యాయ విద్య ఉంది. విదేశీ డిగ్రీల వల్ల మన టాలెంట్‌ పెరుగుతుందనుకోవడం తప్పు. మన టాలెంట్‌ మన పనితనంతో నిరూపించుకోవాలి. ఫారిన్‌ డిగ్రీల కోసమే కుటుంబాలను అప్పుల పాలుచేయడం అవసరం లేదని చెప్పారు. మనం ఏ పని చేస్తున్నా, అది ఎంత మనసు పెట్టి చేస్తున్నాం అనేది ముఖ్యం. న్యాయ రంగంలో విశ్వాసం, నిబద్ధత, , ప్రజల సేవకే ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన యువ న్యాయవాదులకు సందేశమిచ్చారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా డిగ్రీలు అందుకున్న విద్యార్థులు, వారి కుటుంబాల్లో ఉత్సాహం కనిపించింది. ముఖ్య అతిథుల ప్రసంగాలు యువతలో ఆశాభావాన్ని పెంపొందించాయి. నల్సార్‌ యూనివర్సిటీ- తన స్థాయిని నిరూపించుకుంటూ న్యాయవిద్యా రంగంలో దేశానికి ప్రతిభావంతులైన న్యాయవాదులను అందించడంలో ముందుండుతుందని చీఫ్‌ జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ పేర్కొన్నారు.