చౌకధరకే శామ్‌సంగ్ 4జీ ఫోన్
మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు శామ్ సంగ్ సరికొత్త ఉత్పత్తులు, టెక్నాలజీలపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మూడు కొత్త 4జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తోంది. భారత్ లో 4జీ సేవలు జోరందుకుంటుండటంతో ఈ విభాగంలో మరిన్ని ఫోన్లను శామ్ సంగ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ‘జే1’ పేరుతో చౌక 4జీ ఫోన్ ను ప్రవేశపెట్టింది. దీని ధర భారత్ లో రూ. 9,900గా ఉంటుంది. అలాగే, గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్, గెలాక్సీ కోర్ ప్రైమ్ పేరిట మరో రెండు 4జీ ఫోన్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ఇక, గెలాక్సీ సిరీస్ లో అత్యంత సన్నని (6.3 మిల్లీమీటర్ల మందం) ఏ7 హ్యాండ్ సెట్ నూ కంపెనీ ప్రవేశపెట్టింది. దీని ధర 30,499. ఇది సోమవారం నుంచి భారత మార్కెట్లో లభిస్తుందని, మిగతా మూడు స్మార్ట్ ఫోన్ల విక్రయాలు మార్చి రెండో వారం నుంచి మొదలవుతాయని శామ్సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అసీమ్ వర్సి తెలిపారు. 4జీ ఫోన్ జే1 హ్యాండ్సెట్ లో 4.3 అంగుళాల స్క్రీన్, 5 మెగాపిక్సెల్ కెమెరా , 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. మరోవైపు, గెలాక్సీ ఏ7లో 5.5 అంగుళాల స్క్రీన్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2జీబీ ర్యామ్, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ మొదలైన ప్రత్యేకతలున్నాయి.