ఛత్తీస్‌గడ్‌లో అభివృద్దే గెలిపిస్తుంది: అమిత్‌ షా

రాయ్‌పూర్‌,జూన్‌11(జ‌నం సాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ బిజెపిదే అధికారమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. సిఎం రమణ్‌సింగ్‌తో కలసి ఆయన విూడియాతో మాట్లాడారు. ఇక్కడ అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు. త్వరలో ఇక్కడ పరివర్తన్‌ యాత్ర చేపడతామని అన్నారు. ఛత్తీస్‌ఘడ్‌ పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై చేసిన విమర్శలను వ్యక్తిగతంగా చూడరాదు అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటే తన ఉద్దేశం దేశం నుంచి కాంగ్రెస్‌ పార్టీని తరిమేయడం కాదని, కాంగ్రెస్‌ సంస్కృతి నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై చేసిన విమర్శలను రాహుల్‌ వ్యక్తిగతంగా తీసుకోరాదు అని, దేశ ప్రజలకు రాహుల్‌ కొన్ని ప్రశ్నలు వేశారని, వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశానని, ప్రజాస్వామ్యంలో ఎవరికీ ప్రమాదం లేదని అమిత్‌ షా అన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో విూడియా సమావేశంలో మాట్లాడుతూ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోని గాంధీ కుటుంబం దేశాన్ని 55 ఏళ్లు ఏలిందని, కాంగ్రెస్‌ గత పాలకుల గురించి రాహుల్‌ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని షా అన్నారు.