ఛాతీవైద్యుల అస్పత్రిని తరలించవద్దు
వేయి ఎకరాల్లో వేరే చోట సచివాలయం నిర్మించుకోవాలి: నాగం లేఖ
హైదరాబాద్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించినందునే కేసీఆర్‌కు లేఖ రాస్తున్నానని బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి ప్రకటించారు. సచివాలయ నిర్మాణానికి ఆస్పత్రికి లింక్ పెట్టవద్దన్నారు. ఆస్పత్రి తరలింపు నిర్ణయాన్ని విరమించుకునే వరకూ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనిని తరలించాలన్న ఆలోచన మానుకోవాలని మరోమారు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆస్పత్రిని బలవంతంగా తరలించాలని నిర్ణయిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. లేఖ కాపీలను ఎమ్మెల్యేలు, ప్రజాసంఘాలకు పంపిస్తానని, కేసీఆర్ తనను తాను ఎనిమిదో నిజాంగా ప్రకటించుకున్నా అభ్యంతరం లేదని నాగం ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తామని, బ్రహ్మాండమైన సచివాలయాన్ని కట్టుకోవాలని ముఖ్యమంత్రికి అనిపిస్తే వెయ్యి ఎకరాల్లో కట్టుకోమని నాగం సూచించారు. అంతేగాని ఉన్న ఆస్పత్రిని తరలించడం సరికాదన్నారు. చెస్టు ఆస్పత్రి-సచివాలయ తరలింపుపై టీసర్కార్ పునరాలోచన చేయాలని అన్నారు. వాస్తు అనేది వ్యక్తిగత విషయమని.. ప్రభుత్వాలు పాటించాల్సిన నియమాలు కావని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. చెస్ట్ ఆసుపత్రి, సచివాలయం తరలింపుపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటోందని ఆయన విమర్శించారు. టీ.ప్రభుత్వ పరిపాలన నియంతృత్వ, అహంకార ధోరణిలో కొనసాగుతుందని విమర్శించారు. చెస్టు ఆస్పత్రి, సచివాలయ తరలింపు సరికాదని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్నారు. ఇలా మొండిగా పోతే టీ.సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. అందమైన నగరాలు ఉంటేనే పెట్టుబడులు రావని.. పెట్టుబడిదారులకు లాభాలు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుబడులు పెడతారని చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పాలంటే విద్యుత్ ముఖ్యమని తెలిపారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చెస్టు, సచివాలయ తరలింపు నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. లేని ఎడల జిల్లా, మండల స్థాయిల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరోవైపు ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి భవనం వారసత్వ భవనం అని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఛాతి ఆస్పత్రి భవనం వారసత్వ భవనం అని పేర్కొనడానికి అవసరమైన ధ్రువపత్రం సమర్పించవలసిందిగా హైకోర్టు పిటిషనరును కోరింది. ప్రభుత్వం ఇచ్చిన ధ్రువపత్రం సమర్పించాలని ఆదేశించింది.