జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
50వేల పూచీకత్తు..ప్రతి ఆదివారం హాజరు
హైదరాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులతో న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ప్రతి ఆదివారం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని షరతు విధించారు. భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి వారిని అక్కడే వదిలి వచ్చారనే ఆరోపణలపై జగ్గారెడ్డిని ఈ నెల 10న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను, తన భార్య, ఇద్దరు పిల్లలు అమెరికాకు వెళ్తున్నామంటూ పద్నాలుగేళ్ల క్రితం జగ్గారెడ్డి నలుగురికి పాస్‌పోర్టులు తీసుకున్నారని, ఆ పర్యటన అనంతరం ఆయన ఒక్కరే తిరిగి వచ్చారంటూ ఓ వ్యక్తి సికింద్రాబాద్‌లోని మార్కెట్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా
దర్యాప్తు చేసిన పోలీసులు.. జగ్గారెడ్డి అమెరికాకు వెళ్లినప్పుడు తన భార్య, పిల్లలతో కాకుండా గుజరాత్‌కు చెందిన యువతి, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి అక్కడే వదిలేశారని గుర్తించారు. మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమైనందున ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో జగ్గారెడ్డికి బెయిల్ తిరస్కరించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసింది. దీంతో ఆయన అప్పట్నుంచి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. రిమాండ్ గడువు ముగిసినందున జగ్గారెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా న్యాయమూర్తి షరతులతో బెయిల్‌ను మంజూరు చేశారు.