ఉద్యమాలకు స్ఫూర్తి పర్లపల్లి పోరాటం
కరీంనగర్ : అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు పర్లపల్లి గ్రామస్తులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొనియాడారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో హరిత బయోటెక్ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించిన పర్లపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించి, గ్రామస్తులను అభినందించారు. పర్లపల్లివాసుల పోరాటంతో కాలుష్య నియంత్రణ మండలిలో చలనం వచ్చి, 12 ఫార్మా కంపెనీలను మూసివేయించే దిశగా చర్యలు తీసుకుందన్నారు. ఈ ఘనత పర్లపల్లి పోరాటానికే దక్కుతుందన్నారు. పర్లపల్లి పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలన్నారు. ఉద్యమాలతో ఆశించిన ఫలితాలు సాధ్యమని కోదండరాం పర్లపల్లి పోరాటాన్ని ఉదహరించారు.