రజకులకు ఉచిత విద్యుత్ సరఫరాకు మీటర్లను బిగించిన విద్యుత్ అధికారులు
జగదేవ్ పూర్, జూలై 21 జనం సాక్షి:
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలో రజకలకు ఉచిత విద్యుత్ సరఫరా అమలుకాని వైనంపై ఈ నెల 16 వ తేదీన ‘జనం సాక్షి దినపత్రిక’ లో ‘ అమలు కాని ఉచిత విద్యుత్ ఆందోళన పడుతున్న రజకులు ‘ అనే శీర్షికతో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఈ క్రమంలో మండలంలోని చిన్న కిష్టాపూర్ గ్రామంలో కులవృత్తిపై ఆధారపడి ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్న రజకుల ఇండ్లకు విద్యుత్ సిబ్బంది నూతన కరెంటు మీటర్లను బిగించారు. ఈ సందర్బంగా జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షులు రాచమల్ల ఎల్లేష్ గౌరవ అధ్యక్షులు అక్కారం నర్సింలు ఉపాధ్యక్షులు జూపల్లి రాజశేఖర్ లు మాట్లాడుతూ ‘ జనం సాక్షి “దినపత్రికలో ప్రతిదీ ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించి మండలంలోని వివిధ గ్రామాల్లో ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్న రజకుల ఇండ్లకు కరెంటు మీటర్లు బిగించడానికి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు మండలంలోని అలిరాజపేట చిన్న కిష్టాపూర్ గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న రజకులందరికి ఉచిత విద్యుత్ సరఫరాను అమలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నట్లు తెలిపారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తు చేసుకున్న అర్హులైన రజకులందరికి వెంటనే మీటర్లను బిగించనున్నట్లు అధికారులు ముందుకు కదిలారని తెలిపారు. కాగా దౌలాపూర్ గ్రామంలో సైతం త్వరలో మీటర్లను బిగించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ‘ జనం సాక్షి దినపత్రిక ‘ తమ సమస్యలను వెలుగులోకి తీసుకు వచ్చి వాటి పరిష్కారానికి సహకారం అందించడం ప్రశంసనీయమని మండలంలోని రజక సంఘం నాయకులు వివిధ గ్రామాల రజకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|