‘జనం సాక్షి’ సర్వే నిజమైంది… పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

కరీంనగర్‌, జూన్‌ 15 (జనంసాక్షి) :

ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు ‘జనం సాక్షి’ నిర్వహించిన సర్వే కూడా పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయమని తేల్చి చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. ‘జనం సాక్షి’ చెప్పింది నిజమని తేలింది. నిజంగానే పరకాల ఓటర్లు విజ్ఞత ప్రదర్శించారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతిని ఆదరించి గెలిపించారు. తెలంగాణలో తెలంగాణవాదమే గెలుస్తుందని పరకాల ఫలితంలో మరోమారు తేటతెల్లమైంది. పరకాల ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సమైక్యవాద పార్టీలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీమాంధ్ర నుంచి తెప్పించిన డబ్బు మూటలను కుమ్మరించినా ఓటర్లు చెలించలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఆ పార్టీకి ఫలితం దక్కలేదు.వైఎస్‌ జగన్‌ జైలుపాలు కావడాన్ని, వైఎస్సార్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని ఓట్ల రాజకీయాల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాడుకోజూసినా పరకాల ఓటర్లు పట్టించుకోలేదు. సిట్టింగ్‌ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ కొండా సురేఖ ఓటర్ల విశ్వాసాన్ని మాత్రం పొందలేకపోయారు. తెలంగాణవాదం ముందు అన్నీ బలాదూరయ్యాయి.
మరో వైపు మతతత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు దండుకోవాలని చూసిన భారతీయ జనతాపార్టీకి పరకాల ఓటర్లు తగిన శాస్తి చేశారు. మహబూబ్‌నగర్‌ మాదిరిగానే పరకాలలో ఫలితం ఉంటుందని చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీకి ఆశాభంగమే ఎదురైంది. ఈ స్థానంలో బీజేపీ గెలుపు కాదు సరికదా కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. తెలంగాణవాదం ముందు ఏ వాదం పనిచేయదని ఇప్పటికైనా కమలనాథులు గ్రహించాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తూ వస్తున్న కాంగ్రెస్‌ పార్టీ పరకాల ఫలితంతోనైనా గుణంపాఠం నేర్చుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇవ్వకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పరకాల తరహా తీర్పే పునరావృతమవుతుందనే వాస్తవాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా గ్రహించాలి. ఇక టీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే పరకాల విజయం ఆ పార్టీ సొంతం కాదు. ఈ విజయం తెలంగాణవాదుల విజయమని, ఇక్కడ గెలిచింది తెలంగాణవాదమని తెరాస శ్రేణులు గుర్తించాలి.

తాజావార్తలు