జనగామలో విఆర్‌ఎల ఆందోళన ఉధృతం

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ అడ్డగింత

జనగామ,జూలై23(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూల అమలు కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. సోమవారం నుంచి వీఆర్‌ఏలందరూ విధులకు దూరంగా ఉండాలని వీఆర్‌ఏల జేఏసీ పిలుపునిచ్చింది. పే స్కేల్‌ అమలు, ఉద్యోగ భద్రత, అర్హులకు పదోన్నతులు, కారుణ్య నిబంధనలు తదితర డిమాండ్లతో మూడు రోజులుగా జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్ల దగ్గర వీఆర్‌ఏలు రిలే దీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ కాన్వాయ్‌ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. జోరుగా వర్షం కురుస్తున్నా వీఆర్‌ఏలు అధిక సంఖ్యలో హాజరై దీక్షలో పాల్గొంటున్నారు వీఆర్‌ఏలు. అటు, జనగామ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనకు దిగిన విఆర్‌ఏలు.., వరదపై సవిూక్ష సమావేశం కోసం వచ్చిన మంత్రి దయాకర్‌ రావు కాన్వాయ్‌ ను అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కాన్వాయ్‌ ను అడ్డుకున్న వీఆర్‌ఏలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్‌ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వీఆర్‌ఏలను పోలీసులు నిలువరించారు. మరోవైపు, తమ డిమాండ్ల కోసం జిల్లా కార్యాలయాల పికెటింగ్‌ తర్వాత కూడా.. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ నెల 25 నుండి సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు వీఆర్‌ఏలు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వీఆర్‌ఏలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు