జనజీవనం అస్తవ్యస్తం

– ముంబాయిని ముంచెత్తిన వరుణుడు
– ఆదివారం రాత్రినుంచి ఎడతెరిపి లేని వర్షం
– 24 గంటల వ్యవధిలో 170.6మి.విూ.ల వర్షపాతం నమోదు
– మోకాళ్ల లోతు నీళ్లతో వాహనదారులు ఇబ్బందులు
– పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
– పట్టాలపై వర్షపునీరు చేరడంతో పలు రైళ్లు తాత్కాలిక రద్దు
ముంబయి, జులై9(జ‌నం సాక్షి) : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లోని రహదారులపై మోకాళ్ల లోతు నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని పాఠశాలలకు, కళాశాలలకు సోమవారం సెలవులు ప్రకటించారు. మరోవైపు వర్షాల ప్రభావం రైల్వే సేవలపైనా పడింది. కొన్ని రైల్వే మార్గాల్లో పట్టాలపై నీరు నిలబడటంతో పలు రైళ్ల సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 24 గంటల్లో ముంబయిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబయిలో 24 గంటల వ్యవధిలో సుమారు 170.6మి.విూ.ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దక్షిణ ముంబయిలో సోమవారం ఉదయం కేవలం మూడు గంటల వ్యవధిలోనే 51,4మి.మి.ల వర్షపాతం నమోదైంది. రహదారులపై వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తూ ఆ రాష్ట్ర మంత్రి వినోద్‌ త్వాడే ట్వీట్‌ చేశారు. దాదర్‌, సియాన్‌, పరేల్‌, కుర్లా, విద్యావిహార్‌, అంధేరీ, మలద్‌, జోగేశ్వరి సబర్బన్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబయి విమానాశ్రయంలో వాతావరణం అసలు బాగోలేదని, కానీ విమాన సర్వీసులు మాత్రం నడుస్తున్నాయని ఎంఈటీ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు. 72 గంటల్లో వర్షాల కారణంగా జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ముంబయి మెట్రోపాలిటిన్‌ అధికారులు వెల్లడించారు.
————————-