జనవరిలో జీహెచ్‌ఎంసీల ఎన్నికలు

4

– రిజర్వేషన్ల ఖరారు

హైదరాబాద్‌,డిసెంబర్‌11(జనంసాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చే జనవరి మూడో వారంలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. జనవరి మొదటి వారంలో షెడ్యూలు విడుదల చేయాలని, జనవరి 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఆంధ్రా వాసులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పండుగ సెలవుల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. దీంతో పాటు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సంక్రాంతి సమయంలో శబరిమలైకి వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్‌ తేదీ ఉండాలని ఎన్నికల సంఘం ప్రాథమికంగా కసరత్తు చేసింది. మరోవైపు డివిజన్ల రిజర్వేషన్ల కసరత్తు ప్రక్రియ ఈనెల 15న ముగియనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీలకు రెండు, ఎస్సీలకు పది, బీసీలకు 50 సీట్లను రిజర్వు చేసింది. ప్రతి కేటగిరీలో సగం సీట్లను మహిళలకు రిజర్వు చేసింది. మిగతా 88 సీట్లలో 44 సీట్లను అన్‌ రిజర్వుడుగా, 44 సీట్లను జనరల్‌ మహిళా కోటాగా రిజర్వేషన్‌ చేసినట్లు ఈ ఉత్తర్వుల్లో ప్రకటించింది. ఇటీవల చేపట్టిన బీసీ ఓటర్ల గణాంకాల జాబితాలను జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. వీటి ఆధారంగా ఈనెల 15న డివిజన్ల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.