జనవరి కల్లా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రతీ ఇంటికి తాగునీరు

 

అధికారులకు కడియం శ్రీహరి ఆదేశం

పాలేరు, ఎల్‌ఎండీ వరంగల్‌ సెగ్మెంట్ల పనుల్లో జాప్యంపై అసంతృప్తి

వరంగల్‌,ఆగస్టు30 : వచ్చే ఏడాది జనవరి వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని కచ్చితంగా అందించాలని అధికారులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఐదు సెగ్మెంట్ల ద్వారా ఉమ్మడి జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయాలని సూచించారు. బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు సీతారాం నాయక్‌, పసునూరి దయాకర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ పద్మ, ప్రభుత్వ విప్‌ బోడెకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, అరూరి రమేష్‌, వినయ్‌ భాస్కర్‌, శంకర్‌ నాయక్‌, ఒడితెల సతీష్‌, రాజయ్య, కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని పాలేరు, ఎల్‌ఎండీ వరంగల్‌ సెగ్మెంట్ల పనుల్లో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనులను వెంటనే వేగవంతం చేయాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి రివైజ్డ్‌ షెడ్యూల్‌ రూపొందించి ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి షెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తి జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్ధేశర చేశారు. ఇక మిషన్‌ భగీరథ పనులపై జిల్లాల కలెక్టర్లు వారానికోసారి పనుల పురోగతి పై సవిూక్షించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌ భగీరథ పనులను సీరియస్‌ గా తీసుకోవాలి. పనులలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాముఖ్యతను గమనించి పనుల ప్రగతిని పెంచాలన్నారు. వర్కింగ్‌ ఏజెన్సీలతో సవిూక్షించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 15 రోజులకు ఒకసారి నియోజకవర్గ స్థాయిలో స్థానిక శాసనసభ్యులు సవిూక్షించాలని చెప్పారు. అధికారులు, ఏజన్సీలు ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం పనులు చేయకపోతే వారిపై చర్యలుంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక మిషన్‌ భగీరథ కోసం పైపులు సమకూర్చుకోవడం, వాటిని వేయడం, నీళ్లు అందేలా చూసుకోవడం, లీకులు జరగకుండా జాగ్రత్తలు

తీసుకోవడంపై పక్కా ప్రణాళిక రూపొందించుకొని పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసేలా సమన్వయం చేసుకోవాన్నారు.