జమిలితో మోతే..

` ప్రతి 15ఏళ్లకు రూ.10వేల కోట్ల ఖర్చు
` ఈసీ అంచనా
దిల్లీ(జనంసాక్షి): లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలియజేసింది.జమిలి ఎన్నికలకు వెళ్తే.. ప్రతి 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎం లు కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందుకు రూ.10వేల కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా వేసింది.జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర న్యాయశాఖ.. ఎన్నికల సంఘానికి ప్రశ్నావళిని పంపింది. దానికి ఈసీ ఇటీవల సమాధానం తెలియజేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు గరిష్ఠంగా 15ఏళ్లు పనిచేస్తాయి. జమిలి ఎన్నికలను నిర్వహిస్తే.. ఒక సెట్‌ యంత్రాలను వాటి జీవితకాలంలో మూడు సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళ్తే.. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి రెండు సెట్ల ఈవీఎంలు కావాలి. ఒకటి లోక్‌సభ స్థానానికి, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి అవసరం. గత అనుభవాలను పరిశీలిస్తే.. సమస్యాత్మక యంత్రాల స్థానంలో కొత్తవాటిని భర్తీ చేసేందుకు కొన్ని కంట్రోల్‌ యూనిట్లు (సీయూ), బ్యాలెట్‌ యూనిట్లు (బీయూ), వీవీప్యాట్‌ మెషిన్లను అదనంగా రిజర్వ్‌ చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక ఈవీఎంకు ఒక బీయూ, సీయూ, వీవీప్యాట్‌ అవసరం.జమిలి ఎన్నికలకు వెళ్తే కనిష్ఠంగా 46,75,100 బ్యాలెట్‌ యూనిట్లు , 33,63,300 కంట్రోల్‌ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్‌ యంత్రాలు కావాలి.2023 ప్రారంభం నాటికి ఈవీఎం ధరను పరిశీలిస్తే.. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌ ధర రూ.7900, కంట్రోల్‌ యూనిట్‌ ధర రూ.9,800, వీవీప్యాట్‌ ధర రూ.16వేలుగా ఉంది. ఈ లెక్కన, జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలను కొనాలి. వాటికి రూ.10వేల కోట్ల చొప్పున ఖర్చవుతుంది. ఇక, ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలంటే అదనపు పోలింగ్‌, భద్రతా సిబ్బంది, ఈవీఎంల స్టోరేజీ సదుపాయాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని ఈసీ పేర్కొంది. కొత్త యంత్రాల తయారీ, రవాణా, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 2029 నుంచే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని అభిప్రాయపడిరది. అంతేగాక, ఇందుకోసం రాజ్యాంగంలోని ఐదు అధికరణాలను సవరించాల్సిన అవసరముందని పేర్కొంది.ఒకే దేశం` ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం ఇటీవల ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది.