జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత

jammauశ్రీనగర్ః కశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.  గత 43 రోజులుగా కర్ఫ్యూతో స్థానిక జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. అనంతనాగ్ పట్టణం సహా  శ్రీనగర్ లోని కొన్ని ప్రాంతాలలో  కర్ఫ్యూ  కొనసాగడంతోపాటు, కశ్మీర్ వ్యాలీలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిర్భంధాలు అమల్లోఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కొన్నాళ్ళుగా కొనసాగుతున్న కర్ఫ్యూతో కశ్మీర్ ప్రజలు  అష్టకష్టాలు పడుతున్నారు.  కర్ఫ్యూ కొనసాగుతున్నా ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు కావాలని లేదంటే ఆగస్టు నెల్లో జీతాలు నిలిపివేస్తామని  రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరించడంతో ఆందోళన చెందుతున్నారు. శాంతి భద్రతల పరిస్థితి, నిర్దేశకాలను బట్టి ప్రభుత్వం ఆంక్షలు విధించాలని, లేదంటే నిరంకుశత్వానికి నిదర్శనమౌతుందంటూ  ఉద్యోగులు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు.

మరోవైపు శ్రీనగర్ ఓల్డ్ సిటీ నౌహట్టా ప్రాంతంలో ఉన్న జామియా మసీదులో శాంతి భద్రతల దృష్ట్యా ఆరోరోజూ ప్రార్థనలను నిలిపివేశారు. హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన  సీనియర్ వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలి గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ లు..  నిబంధనలను తోసిపుచ్చి  బద్గామ్ జిల్లా ఆరిపంథాన్ గ్రామంలో పర్యటనకు ప్రయత్నించడం ఆందోళన రేపడంతో తిరిగి వారిని అరెస్టు చేశారు.  గిలానీ, ఉమర్ లను అరెస్టు చేసిన అనంతరం, ముందు కొంత సమయం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉంచి..  తిరిగి  శ్రీనగర్  లో గృహ నిర్బంధాన్ని విధించారు.