జమ్ములో కూలిన హెలికాప్టర్
– మృతుల్లో హైదరాబాదీ మహిళా పైలెట్ దుర్మరణం
శ్రీనగర్‌్ నవంబర్ 23 (జనంసాక్షి):
జమ్ముకాశ్మీర్‌లో హెలిక్యాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఏడుగురు యాత్రీకుల బృందంతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న హెలిక్యాప్టర్ కాట్రా వద్ద కుప్పకూలింది. సాంజీచాట్ నుంచి కాట్రాకు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులతో పాటు ఓ మహిళా పైలట్ మృతి చెందారు. ప్రమాదం నుంచి తప్పించేందుకు హెలిక్యాప్టర్‌ను బహిరంగ ప్రదేశంలో టేకాఫ్ చేయడానికి పైలెట్ చేసిన ప్రయత్నం విఫలమైందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. హెలికాఫ్టర్ కూలి చనిపోయిన మహిళాపైలట్ సుమిత్రా విజయన్ హైదరాబాదీ అని తెలిసింది. మాజీ ఎయిర్‌ఫోర్స్ పైలట్ అయిన సుమిత్రా విజయన్ హిమాలయ హెలీ సర్వీసెస్‌లో పైలట్‌గా పనిచేస్తూ ఈ ప్రమాదంలో చనిపోయారు. దట్టమైన పొగమంచు కారణంగానే హెలిక్యాప్టర్ ప్రమాదానికి గురైనట్టు ప్రాథమిక సమాచారం. పొగమంచు కారణంగా జమ్ము ఎయిర్‌పోర్టులో పలు విమానాలు ల్యాండ్ కాలేదు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పైలెట్ సుమితా విజయన్‌తో పాటు యాత్రికుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన వైష్ణోదేవి ఆలయానికి ప్రతిరోజు వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.