జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ
– 80 వేల కోట్ల నజరానా
– ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,నవంబర్ 07 (జనంసాక్షి):
జమ్మూకాశ్మీర్‌కు ప్రధాని మోదీ ప్యాకేజీ ఇచ్చారు. శ్రీనగర్‌లో నిర్వహించిన భాజపా-పీడీపీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి రూ.80వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. దేశం ఎగువన ఉన్న జమ్మూకాశ్మీర్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని, పర్యాటకంగా కూడా గతంలో ఉండే విధంగా పూర్వవైభవం తీసుకువస్తామని హావిూ ఇవ్వడంతో అంతటా హర్షం వ్యక్తం అయింది. మొత్తం 80 వేల కోట్లను జమ్ము -కాశ్మీర్‌కు నరేంద్ర మోడీ కేటాయించారు. కొన్ని రోజుల నుంచే శ్రీనగర్ పర్యటనలో ప్రధాని ఈ ప్రకటన చేయవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. ఈ తరుణంలో అందుకు తగినట్లుగానే మోడీ ప్రకటన చేయం విశేషం. పైగా మరిన్ని నిధులు కూడా ఇస్తామని మోడీ భరోసా ఇచ్చారు. మరోవైపు ఏపీలో ఈ విషయం చర్చకు దారితీసింది. మొన్న అమరావతి కోసం వచ్చినపుడు ఎటువంటి ప్యాకేజీ మాట్లాడకుండా జమ్మూలో మాత్రం ప్యాకేజీ ఇవ్వడం దారుణమని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. ప్యాకేజీపై మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రదాని మోడీ కూడా పాత తప్పునే చేశారని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ సమస్యలను కేవలం డబ్బుతో మాత్రమే కొలుస్తున్నారని, ఇది సరికాదని వ్యాఖ్యానించారు.