జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రపంజా

1d8963up

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కథువా జిల్లాలోని రాజ్ బాగ్ పోలీస్ స్టేషన్ పై ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఏకే 47 తుపాకులు, గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు. పోలీసులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఉగ్రవాదుల దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్, మరో పౌరుడు ఉన్నారు.

ఉగ్రవాదుల దాడిలో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు కథువా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు తాము తేరుకునేలోపే కాల్పులతో విరుచుకుపడ్డారని వారు చెప్పారు. ఉగ్రవాదుల దగ్గర ఏకే 47 తుపాకులు, గ్రెనేడ్లు ఉన్నాయని తెలిపారు.

అటు పోలీస్ స్టేషన్ లో నక్కిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దాదాపు ఐదు గంటలపాటు కొనసాగిన ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదుల నుంచి స్పందన లేకపోవడంతో… పోలీసులు స్టేషన్ లోపలికి వెళ్లారు. లోపలున్న ఉగ్రవాదుల మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఎట్టకేలకు ఉగ్రవాదులు హతమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.