జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్‌, జులై10(జ‌నంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో సోపియాన్‌ జిల్లాలోని కుందలాన్‌ ఏరియాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదలను సీఆర్‌పీఎఫ్‌ దళాలు హతమార్చాయి. దక్షిణ కశ్మీర్‌ సోఫియాన్‌ జిల్లా కుండలన్‌ గ్రామంలోని ఒక ఇంట్లో ఆరుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో 34 రాష్టీయ్ర రైఫిల్స్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌ ఎస్‌వోజీ , సీఆర్‌పీఎఫ్‌ దళాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సైన్యం రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రత సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ఉగ్రవాదులను తుదముట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు, వీరిలో ఒకరు జూనియర్‌ ఆఫీసర్‌ స్థాయి జవాన్‌ కూడా ఉన్నారు. సైన్యం, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు కొనసాగాయి. గాయపడిన సైనికులను శ్రీనగర్‌ ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులను అక్కడ నుంచి తప్పించేందుకు కొందరు స్థానికులు ప్రయత్నించగా ఈ క్రమంలో అల్లరి మూకలు అక్కడికి చేరుకుని సైన్యం రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఉగ్రవాదులను తప్పించేందుకు అల్లరి మూకలు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. భద్రతా దళాలు చుట్టుముట్టిన ఉగ్రవాదుల్లో తన కొడుకు కూడా ఉన్నాడని భ్రమపడిన ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. మొమందర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ నైకూ కుమారుడు జీనత్‌ నైకూ రెండు నెలల కిందట ఉగ్రవాదుల్లో చేరాడు. తాజా ఎన్‌కౌంటర్‌లో జీనత్‌ ఉన్నట్లు పుకార్లు రావడంతో కలతచెందిన మహమ్మద్‌ గుండెపోటుకు గురయ్యాడు. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్దరించారు. కుప్వారాలోని హంద్వారాలో ఓ ఉగ్రవాదిని భద్రత దళాలు సోమవారం మట్టుబెట్టాయి. బందిపోర జిల్లాలో ఓ మహిళను ఉగ్రవాదులు గొంతు నులిమి హత్య చేశారు. హింజాన్‌ ప్రాంతంలోని షాగుండ్‌ గ్రామంలో పీడీపీకి చెందిన మహిళా నేతను ఆదివారం రాత్రి తన ఇంట్లో నుంచి లాక్కొచ్చి హతమార్చారు.