జయలలిత అక్రమాస్తుల కేసులో నేడు తీర్పు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న ట్రయల్ కోర్టు జయలలిత అక్రమాస్తులకు సంబంధించి ఆమెతోపాటు ఆమె నెచ్చెలి శశికళ, బంధువు ఇళవరసి, దత్తపుత్రుడు సుధాకరన్‌లకు నాలుగేండ్ల జైలుశిక్ష విధించింది. దీనిపై జయలలిత బృందం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా.. మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని కర్ణాటక హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ గడువు మంగళవారంతో ముగియనుండగా అంతకు ఒక్కరోజు ముందు హైకోర్టు తీర్పు వెలువడనుంది. దీంతో జయలలిత కేసు నుంచి బయటపడుతారా? లేక ట్రయల్ కోర్టును తీర్పును హైకోర్టు సమర్థిస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.