జయలలిత డిశ్చార్జి అయ్యే అవకాశం

jayalalithaa-pti-pic-360ఇప్పటికి దాదాపు 48 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మరో రెండు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. కీలకమైన అంశాలన్నీ అదుపులోనే ఉన్నాయని.. ప్రస్తుతం ఆమెకు ఫిజియోథెరపీ చేస్తున్నారని, మరో 15 రోజుల్లో ఇంటికి పంపే అవకాశం ఉందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి. పొన్నియన్ చెప్పారు. సీసీయూ నుంచి రూమ్‌లోకి మార్చే విషయంపై మీడియా ప్రశ్నించగా.. అక్కడకు, ఇక్కడకు తేడా అత్యవసర పరికరాలు మాత్రమేనని ఆయన వివరించారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చని అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు.. పూర్తిస్థాయిలో కోలుకుని, మామూలు మనిషి అయిన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్లాలని జయలలిత భావిస్తున్నట్లు పొన్నియన్ తెలిపారు.