జయాపజయాలు శాశ్వతం కాదు

3

– ధైర్యంగా ముందుకెళ్లండి

– సోనియా

న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఐదు రాష్ట్రాల్లో అపజయంతో నిరాశలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ  ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఓటపోటములు శాశ్వతం కాదనీ, కార్యకర్తలు విలువలకు కట్టుబడిపనిచేయాలని ఉద్భోధించారు. నీతిని వదిలిపెట్టి సాధించిన విజయాలు శాశ్వతంగా ఉండవన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.అస్పాం, కేరళ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం మళ్లీ పునరావృతం కాదన్నారు. రాజీవ్‌ గాంధీ తన చివరి రక్తం బొట్టు వరకు సామాజిక సమరసత కోసం పాటుపడ్డారని, ఆయన చూపిన ఆధునికత, సామాజిక సమరసతలకు అంకితమయి పనిచేయాలని సూచించారు. రాజీవ్‌ గాంధీ దేశాభివృద్ధిలో తనదైన ముద్రవేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దిగ్విజయ్‌ సింగ్‌, గులాంనబీ ఆజాద్‌, జనార్ధన్‌ ద్వివేది, అజిత్‌ జోగి హాజరయ్యారు. రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏకే అంటోని, చిదంబరంలు హాజరు కాకపోవడం గమనార్హం.