జయ ఆరోగ్యంపై వదంతులు

jaya-03-oct

– అపోలో వద్ద ఉద్రిక్తత

– అమ్మ కోలుకుంటోంది

– తమిళనాడు సర్కారు

చెన్నై,అక్టోబర్‌ 2(జనంసాక్షి): తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై మళ్లీ వదంతులు రావడం కలకలం రేపుతోంది. ‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన బాట పట్టారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. మరోవైపు తమిళనాడు మంత్రులు కూడా అపోలో ఆస్పత్రికి చేరుకుంటుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.జ్వరం, డీ హైడ్రేషన్‌తో సీఎం జయలలిత గత నెల 22న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గ్రీమ్స్‌ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు వైద్య బృందం మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వారం రోజులపాటు అమ్మ ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశారు. తదుపరి బులిటెన్‌లు ఆగడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.అదే సమయంలో సీఎం జయలలితకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా వదంతులు వచ్చాయి. సీఎం ఆరోగ్యంపై అధికారిక ప్రకటన, ఫొటోతో సహా బహిర్గతం చేయాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే జయలలితను శనివారం రాత్రి పరామర్శించిన ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు.. ఆమె చికిత్స పొందుతున్న  వార్డులోకి తాను వెళ్లినట్టు, అక్కడ అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించినట్టు తెలిపారు. ఆమె కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఆమె త్వరితగతిన కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడులో వదంతులు, ఊహాగానాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న అభిమానులు.. ఏక్షణంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జయలలిత సమగ్ర హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని, ఆమె ఫొటోను విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.