జర్నలిస్టుల ఇళ్ళు, ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం.

ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు.
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కు అభినందనలు.
నాగర్ కర్నూల్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు25(జనంసాక్షి):
సుదీర్ఘకాలంగా రాష్ట్రంలోని జర్నలిస్టుల ఇళ్ళు,ఇళ్ల స్థలాల పై నెలకొన్న సందిగ్ధతకు సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట కలగడం అభినందనీయo, హర్షణీయమని నాగర్ కర్నూల్ వర్కింగ్ జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్,కార్యదర్శి జెమినీ సురేష్, ట్రెజరర్ సురేష్ రావు,సభ్యులు దినకరరావు లు గురువారం ఒక ప్రకటలో అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు,ఇళ్ళ నిర్మాణానికి అనుమతులిస్తూ సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ తీర్పునివ్వడం తెలంగాణలోని జర్నలిస్టులకు శుభపరిణామమని వారన్నారు. సుదీర్ఘకాలంగా జర్నలిస్టుల ఇల్లు, ఇళ్ల స్థలాల పై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడడం జర్నలిస్టులకు ఊరటనిచ్చిందన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల వివాదాలను త్వరితగతిన పరిష్కరించడానికి జర్నలిస్టు సంఘాల అభ్యర్థన, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పిన పిదపే వెంటనే జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలకు సంబంధించి ప్లాట్లు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కేసులను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదులను నియమించి నందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జర్నలిస్టు సంఘాలు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,కమిటీ సభ్యులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలు నియోజకవర్గాలు, మండలాల వారీగా జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్ల స్థలాలను కేటాయించడానికి ఈ తీర్పు అనుకూలమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఇల్లు, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయ్యే దశకు రావడం అభినందనీయమన్నారు.రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్లు చొరవ చూపి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇల్లు, ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు కోరారు.