జర్నలిస్టుల సంక్షేమమే ఎపియుడబ్ల్యుజె లక్ష్యం
ఒంగోలు, జూన్ 24:
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజీలేని పోరాటాలను కొనసాగిస్తున్న సంఘం ఎపియుడబ్ల్యుజె అని రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు. ఎపియుడబ్ల్యుజె జిల్లా కౌన్సిల్ సమావేశం అధ్యదక్షుడు ఎస్.రామాంజనేయప్రసాద్ అధ్యక్షతన స్థానిక ఎపి టూరిజం అతిథి గృహంలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐవి సుబ్బారావు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను గడుపుతున్న జర్నలిస్టుల పట్ల యాజమాన్యాలు కఠిన వైఖరి అవలంభిస్తున్నాయని అలాగే మరోవైపు జర్నలిస్టులపై రోజురోజుకు దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులకు వ్యతిరేకంగా యూనియన్ అనేక సందర్భాల్లో పోరాటాలను కొనసాగించిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మీడియా సెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న మజీదియా కమిటీ సిఫార్సులను అమలు పరచడంలో కేంద్రప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని కావున ఇప్పటికైనా ఆ కమిటీ సిఫార్సులను అమలు పరచాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ జనార్దన్, కోశాధికారి డి కనకయ్య, నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఎ.సురేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.