జలదిగ్భందంలో కోస్తా జిల్లాలు

నీట మునిగిన వందలాది గ్రామాలు
స్తంభించిన రవాణ.. పలు రైళ్ల రద్దుహెదరాబాద్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి):
ప్రకృతి కన్నెర్ర చేసింది.. ‘నీలం’ నిండా ముంచేసింది.. పల్లెలు, పట్టణా లను ముంచెత్తింది. పాతిక ప్రాణాలకు పైగా పొట్టనబెట్టుకున్న తుపాను.. రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. కడగండ్ల వాన దెబ్బకు కోస్తా కకావిక లమైంది. ‘తూర్పు’ వెళ్లే రైలు నిలిచిపో యింది. ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతన్న బతుకు చితుకు పోయింది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతాంగం కన్నీరుమున్నీ రవుతోంది. అధికారిక లెక్కల ప్రకారమే 10 లక్షలకు పైగా ఎకరాల్లోని పంట నీట మునిగింది. అనధికారికంగా 14 లక్షల ఎకరాల్లోని పంట వరద పాలైం దని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప టివరకు 34 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 450 పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. వేయి కిలోవిూటర్ల మేర రహదారులు కొట్టుకుపోయాయి. వరద లతో ఎంత మేర నష్టం జరిగిందనే దాని పై ప్రభుత్వం అంచనా వేస్తోంది. పున రావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, బాధి తులను అక్కడికి తరలిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తుపా ను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అత లాకుతలమైంది. నాగవళి, వంశధార ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా యి. వరదనీటితో జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగాయి. 40కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాశిబుగ్గ మండ లంలో 10 ఇళ్ల గోడలు కూలాయి. మందసలో
నాలుగు, పలాస, కాశీబుగ్గలో ఆరు ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాల కారణంగా గ్రావిూణ ప్రాంత రహదారులు కోతకు గురయ్యాయి. ఊహించని రీతిలో పంట, ఆస్తి నష్టం సంభవించింది. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల వరి నీట మునిగంది. అయితే, అనధికరంగా ఇది 80 వేల ఎకరాల వరకు ఉంటుందని సమాచారం. 43 గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు.
ఎడతెరిపి లేని వర్షాలతో తూర్పు గోదావరి జిల్లా వణికిపోతోంది. మూడు దశాబ్దాల చరిత్రలో.. ముందెన్నడు కనివిని ఎరుగని రీతిలో వరదలు పోటెత్తాయి. ఇప్పటివరకు వరదల కారణంగా జిల్లాలో 13 మంది దుర్మరణం చెందారు. వరద ఉద్ధృతికి ఇంకా వందల గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సుమారు 300 ఇళ్లు దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల పంట నీట మునిగింది. దాదాపు 4.50 లక్షల ఎకరాల వరి పంట, 25 వేల హెక్టార్లలోని పత్తిపంట పూర్తిగా దెబ్బతింది. ఏలేరు జలాశయం నుంచి విడుదల చేసిన నీరు గ్రామాలను ముంచెత్తింది. పంపా జలాశయం నుంచి విడుదలవుతున్న నీరు అన్నవరం జాతీయ రహదారిపైకి చేరింది. రోడ్డుపై ప్రమాదక స్థాయిలో ఆరు అడుగుల మేర ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విశాఖ-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కిలోవిూటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. తాండవ నది ఉద్ధృతికి లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. పలు ప్రాంతాల్లో అధికారులు 68 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు ప్రారంభించారు. 37 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పోతల కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద మాత్రం మరింత ఎక్కువైంది. విజయవాడలో పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బుడమేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. లేబర్‌ కాలనీ, ఉర్మిళానగర్‌, రామరాజయ్యనగర్‌, రోటరీ నగర్‌, కబేళా ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నాలుగు రోజులుగా నీళ్లలోనే నానుతున్నాయి. పాతరాజరాజేశ్వరీపేట, అంబేద్కర్‌నగర్‌, కేఎల్రావునగర్‌, దీన్‌దయాల్‌నగర్‌ ప్రాంతాల్నీ వరద నీరు చుట్టుముట్టింది. శివారు ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టకపోగా మరింత పెరిగింది. దాదాపు 2.50 లక్షల ఎకరాల పంటలు నీట మునిగాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అనధికారిక సమాచారం ప్రకారం 3.50 లక్షల ఎకరాల్లోని పంట నీట మునిగిందని సమాచారం. వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలను అక్కడికి తరలిస్తున్నారు. విశాఖ జిల్లా అతులాకుతలమైంది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కోలుకోలేని రీతిలో దెబ్బతింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. ఉప్పుటేరుకు వరద పోటెత్తి భీమిలి మండలం చిప్పాడ వద్ద రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పొట్నూరు-రెడ్డిపల్లి మధ్య నూకాంభికా కాజ్‌వేను నీరు ముంచెత్తింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మత్స్యుగెడ్డ వరద నీటిఓ 12 గ్రామాలు రాకపోకలు నిలిచాయి. పద్మనాభ పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూలకుద్దు, చిప్పాడ, సిటీనగర్‌, పాతపాలెం, జీరుపేట తదితర గ్రామాలు నీట మునిగాయి. కనపర్తి, చూసుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 5 వేల మంది బాధితులు రెండ్రోజులుగా సహాయం కోసం ఎదురుచూస్తన్నారు. చోడవరం మండలం భోగాపురం వద్ద శారద నది వరద నీటిలో పలువురు రైతులు చిక్కుకున్నారు. భీమిలిలో అలల ఉద్ధృతికి ఐదు బోట్లు కొట్టుకుపోయాయి. ముంపునకు గురైన ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అనంతగిరి-కొత్తవలస రైల్వే మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బండరాళ్ల పునరుద్ధరణకు మూడ్రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దీంతో రైల్వేకు రోజూ రూ.25 కోట్ల మేర నష్టం వాటిల్లనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు, విజయనగరం జిల్లా ఎస్‌కోట మండలం బొడ్డవరం సవిూపంలో కేకే రైల్వే లేన్‌ వంద విూటర్లకు పైగా కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అధికారులు ట్రాక్‌ మరమ్మతులు ప్రారంభించారు. భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా రైతులకు తీవ్ర నష్టం కలిగింది. వరదలు పోటెత్తి పంటపొలాలను ముంచెత్తడంతో చేతికందని పంట నీటిపాలైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.700 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. మధిర, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు, నియోజకవర్గాల్లో దాదాపు 4 లక్షల ఎకరాల వరి, పత్తి పంట నీట మునిగింది. సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. 48 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.
పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు
వరద ఉద్ధృతికి పలు రైళ్లు నిలిచిపోయాయి. రైలు పట్టాల అంచుల వరకూ నీరు రావడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లాల్సిన దురంతో, గరీబ్‌రథ్‌ రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లను దారి మళ్లించారు. తాండవ, పంపా కాలువల ఉద్ధృతికి తుని, అన్నవరం ప్రాంతాలకు వరద నీరు అధికంగా రావడంతో పట్టాలు నీట మునిగాయి. దీంతో విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిఠాపురంలో పూరి ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లవలసిన దురంతో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు వరద ఉద్ధృతి తగ్గిన ప్రాంతాల్లో రైల్వే అధికారులు రాకపోకలు పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలుచోట్ల ట్రాక్‌లను పరిశీలిస్తున్నారు. వరద ఉద్ధృతికి పాడైపోయిన ట్రాకులు సరిచేసి రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టారు.
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌పై మంచు దుప్పటి పరుచుకుంది.. మితిమీరిన కాలుష్యమమే ఢిల్లీలో పెరిగిపోతున్న పొగమంచుకు కారణమంటున్న శాస్త్రజ్ఞులు