జలవివాదం రెండు రాష్ట్రాలకే పరిమితం

1

– కృష్ణా జలవివాదంపై కేంద్రం అఫిడవిట్‌

– అన్యాయమన్న తెలంగాణ ప్రభుత్వం

న్యూఢిల్లీ,డిసెంబర్‌8(జనంసాక్షి): కృష్ణానదీ జలాల పంపిణీ వివాదాన్ని ఎపి, తెలంగాణలకే పరిమితం చేయాలని కేంద్రం సుప్రీంను కోరింది.  మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తన వైఖరిని ధర్మాసనం ముందు స్పష్టం చేసింది. కృష్ణా జలాల పునఃపంపిణీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాకే పరిమితం చేయాలని, రెండు రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆందప్రదేశ్‌ విభజన నేపధ్యంలో కృష్ణా జలాల పంపిణీ పై కేంద్రం కొంత స్పష్టత ఇచ్చింది.ఈ నది జలాలను నాలుగు రాష్ట్రాలకు తిరిగి పంచాలా?లేక ఎపి, తెలంగాణలకే పరిమితం కావాలా ?అన్నదానిపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రింకోర్టు కోరింది. మహారాష్ట్ర ,కర్నాటక లకు పునః పంపిణీ అవసరం లేదని కేంద్రం తెలిపింది. తెలంగాణ ,ఎపి ల మధ్యనే నీటి విభజన జరగాలని కేంద్రం తన వైఖరిగా సుప్రింకోర్టు కు తెలియచేసింది. నాలుగు రాష్ట్రాలకు మళ్లీ కృష్ణా జలాలలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కాని కేంద్రం ఈ వాదనకు కేంద్రం అంగీకరించలేదు. సుప్రింకోర్టు ఈ కేసు విచారణను డిసెంబర్‌ పదికి వాయిదా వేసింది. కృష్ణా నదీ జలాల కేటాయింపుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని తెలంగాణ ఆరోపిస్తోంది.  ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు కేటాయించిన నీటినే ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాలని కోర్టుకు తెలిపింది. ఈ వాదనను తెలంగాణ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరపాలని తెలంగాణ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.  కృష్ణా నదీ జలాల పంపిణీలో న్యాయమైన వాటా కోసం పోరాటం చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీ రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. కేంద్ర వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నదీ జలాల పంపిణీ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం ఇవాళ ప్లేట్‌ ఫిరాయించిందని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందన్నారు. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతందని అన్నారు. గతంలో ఇదే విషయాన్ని  కేంద్రానికి నివేదించామని అన్నారు. కేంద్రమంత్రి ఉమాభారతిని కలసి కూడా తమ వాదన వినిపించామని, న్యాయం చేస్తామన్న వారు ఇలా చేస్తారని అనుకోలదేన్నారు. ఇదిలావుండగా కృష్ణా జలాల విషయంలో కేంద్రం తీరు దారుణమని ఎంపీ వినోద్‌కుమార్‌ మండిపడ్డారు.ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాజలాల పంపిణీలో జరిగిన అన్యాయమే ఇప్పుడు కూడా జరుగుతోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. కేంద్రం తీరువల్ల మళ్లీ తెలంగాణ నష్టపోతున్నాదని అన్నారు. కృష్ణా నది జలాల పునఃపంపిణీ చేయాలని రాష్ట్రం ఏర్పడిన నెల రోజుల్లోనే ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డును పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా విచారణ జరిపించాలని కోరాం. అయినా అన్యాయం జరగడం బాధాకరమన్నారు. కృష్ణా నది జలాల పంపిణీ విషయంలో కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు బృందం సమాలోచనలు జరిపింది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌, అడిషనల్‌ జనరల్‌ రాంచందర్‌రావు, న్యాయవాది రవీందర్‌రావు పాల్గొన్నారు.  సమావేశ అనంతరం వినోద్‌ విూడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నది జలాల్లో అన్యాయం జరుగుతున్నదని అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎంల దృష్టికి సీఎం కేసీఆర్‌ తీసుకెళ్లారు. ట్రిబ్యునల్‌కు అప్పటి ముఖ్యమంత్రులు తెలంగాణ వాదనను సరిగా వినిపించలేదు. 1956 అంతర్‌రాష్ట్ర నదీ జలాల చట్టం సెక్షన్‌ 3 ప్రకారం జులై 14, 2014న పిటిషన్‌ దాఖలు చేశాం. ఈ పిటిషన్‌ ప్రకారం కేంద్రం ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలి. సమస్య పరిష్కరించలేని పరిస్థితుల్లో ట్రిబ్యునల్‌కు సూచించాలి. పిటిషన్‌ తర్వాత ఒక్కసారి కూడా కేంద్రం నాలుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపలేదు. కేంద్రం ఈ సమస్యను విస్మరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా ఈ అంశంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఎంపీ కవిత సమావేశమయ్యారు. రాష్ట్రానికి మేలు జరిగే అంశాలపై సంతకం చేస్తామని ఉమాభారతి హావిూ ఇచ్చారు. విచారణ కోసం ట్రిబ్యునల్‌కు పంపిస్తామని నాలుగు రాష్ట్రాల వాదనలు వినిపించి నీటి కేటాయింపులు చేసుకోవచ్చని హావిూ ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో కేంద్రం తరపు న్యాయవాది తెలంగాణకు నష్టం జరిగేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం చట్ట వ్యతిరేకం. సెక్షన్‌ 3 ప్రకారం రాష్ట్రాలతో ఒక్కసారి కూడా కేంద్రం సంప్రదింపులు జరపలేదు. కృష్ణా నదీ జలాల అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వినోద్‌ స్పష్టం చేశారు.