జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా కిసాన్ మేళ
గరిడేపల్లి, సెప్టెంబర్ 21 (జనం సాక్షి): శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా కిసాన్ మేళ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కె వి కె ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లవ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి డి రామారావు నాయక్ , సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి బి శ్రీధర్ , లయోలా కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ఆరుల్ జ్యోతి ఎస్ జే , బ్లాక్ ఇంఛార్జి అంతోనీ ప్రభు లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కె.వి.కె లో ఏర్పాటు చేసిన వివిధ నూతన వ్యవసాయ ప్రదర్శనాలు తిలకించారు. తదుపరి సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ మాట్లాడుతూ రైతులు వాతావరణ ఆధారిత పంటలు సాగు చేయలని సూచించారు. సమగ్ర వ్యవసాయ విధానాలు పాటిస్తూ రైతులు ఆదాయం రెట్టింపు చేసే మార్గాలను పంటలను ఎంచుకోవాలని తెలిపారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని సూచించారు. విద్యార్థిని విద్యార్థులు వారి చదువులు బిఎస్సి తో ఆపకుండా మరిన్ని పై చదువులు చదవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి బి. శ్రీధర్ మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు వేసుకోవాలని సూచించారు. ఉద్యాన పంటలు సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. కే వీ కే ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లవ కుమార్ మాట్లాడుతూ బుధవారం ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను తిలకించి రైతులు నేర్చుకున్న ఈ నూతన వ్యవసాయ విధానాలను తమ పొలంలో ఉపయోగించి అధిక దిగుబడులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు డి. నరేశ్, నరేశ్, ఏ. కిరణ్, డి. ఆదర్శ్, యన్. సుగంధి, మాధురి, బేయర్ టెరిటరీ మేనేజర్ లక్ష్మీనారాయణ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రవి కుమార్, లయోలా కాలేజ్, ఓరియంటల్ యూనివర్సిటీ, భగవంత్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థిని విద్యార్థులు మోడల్ స్కూల్ విద్యార్థులు రైతులు మొత్తం 236 మంది పాల్గొన్నారు.