జవాన్‌ ఔరంగజేబ్‌ హత్య వెనక ఐఎస్‌ఐ హస్తం

శ్రీనగర్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆర్మీ జవాన్‌ ఔరంగజేబ్‌ను కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు విచక్షణరహితంగా బుల్లెట్లు కురిపించి హత్య చేయడం వెనుక పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం ఉందని నిఘా వర్గాలు ఆరోపించాయి. రంజాన్‌ అని కూడా చూడకుంటా కిడ్నాప్‌ చేసి చంపడాన్ని స్తానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కశ్మీర్‌లో ‘జీహాద్‌’కు తెగబడుతున్న ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరివేస్తున్న భారత ఆర్మీకి ఝలక్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇంతటి దుశ్చర్యకు ఐఎస్‌ఏ పాల్పడిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తద్వారా కశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు తాము బెదిరేది లేదని పాక్‌ సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కనబడుతోందని వారంటున్నారు. ఆర్మీ జవాను ఔరంగజేబ్‌ రంజాన్‌ జరుపుకునేందుకు తన ఇంటికి వెళ్తుండగా అతన్ని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒంటినిండా బుల్లెట్లతో అతను శవమై తేలాడు. తల, మెడపై కాల్పులు జరిపి అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు ఈ హత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. జవాను ఔరంగజేబును ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడంపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాఓ ట్వీట్‌లో స్పందించారు. ‘ఈరోజు మరో భయానక వార్త వినాల్సి వచ్చింది. ఔరంగజేబ్‌ ఆత్మకు శాంతి కలిగాలి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాది సవిూర్‌ టైగర్‌ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఔరంగజేబ్‌ పూంచ్‌ జిల్లావాసి. విధులు ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా సాయుధ టెర్రరిస్టులు ఆయనను చుట్టుముట్టి తుపాకులతో బెదరించి కిడ్నాప్‌ చేశారు. ఆ వార్త తెలిసిన వెంటనే జమ్మూకశ్మీర్‌ పోలీసులు పెద్దఎత్తున గాలింపు జరపగా, గుస్సు గ్రామంలో బుల్లెట్లతో తూట్లు పడిన ఆయన మృతదేహం లభ్యమైంది.