జాట్ రిజర్వేషన్లు చెల్లవ్

lmyavdlnకేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో జాట్ కులస్థులకు రిజర్వేషన్ కల్పిస్తూ గత యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తి తరుణ్ గొగొయ్, న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. జాట్ కులస్థులను ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలోకి(ఓబీసీ) చేరుస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను తోసిపుచ్చుతున్నామని ధర్మాసనం పేర్కొంది. సామాజికంగా, ఆర్థికంగా జాట్లను వెనుకబడిన కులస్థులుగా పరిగణించలేము కాబట్టి వారిని కేంద్రానికి సంబంధించిన ఓబీసీల జాబితాలో చేర్చలేమంటూ వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్(ఎన్‌సీబీసీ) చేసిన నిర్థారణలను సైతం తోసిరాజని యూపీఏ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ‘‘కులమన్నది ఒక ప్రధాన అంశమే అయినప్పటికీ, సమాజంలో ఒక వర్గానికి సంబంధించిన వెనుకబాటుదనాన్ని నిర్థారించేందుకు అదే ఏకైక అంశం కాజాలదు’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఓబీసీ రిజర్వేషన్లపై మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా ఉదాహరిస్తూ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘గతంలో ఒక సామాజిక వర్గాన్ని ఓబీసీల జాబితాలో చేర్చి తప్పు చేసి ఉంటే.. భవిష్యత్తులో మరో తప్పునకు అది ప్రాతిపదిక కారాదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.