జాతరకు 382 సిసి కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలు,20 డిస్ప్లే ప్యానెల్స్……


మొత్తం 33 పార్కింగ్ స్థలాలు, 7 హోల్డింగ్ పాయింట్స్..

ములుగు జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐపీఎస్
ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి):-
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర- 2022 సందర్భంగా  పోలీసు శాఖ సంసిద్ధంగా ఉంది. జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది. సుమారు కోటి నుండి కోటి 25 లక్షల భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం.మొత్తం మూడు లక్షల నుండి మూడున్నర లక్షల వాహనాలు మరియు నాలుగు వేల ఆర్టీసీ బస్సులు పార్కింగ్ చేయడానికి పార్కింగ్ స్థలాలు సిద్ధంగా ఉన్నాయి.సుమారు 10,000 పోలీస్ సిబ్బంది ఈ జాతరలో విధులు నిర్వర్తించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ చేయనున్నారు. 382 సిసి కెమెరాలు,2 డ్రోన్ కెమెరాలు, 20 డిస్ప్లే ప్యానెల్స్ ని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కి అనుసంధానించాము.వీటి ద్వారా ట్రాఫిక్ మరియు శాంతి భద్రతలను 24 గంటలు పర్యవేక్షిస్తాము.మొత్తం 33 పార్కింగ్ స్థలాలు, 7 హోల్డింగ్ పాయింట్స్ వాహనాలు నిలుపుటకు సంసిద్ధంగా ఉన్నాయి.గత జాతర మాదిరిగానే ఈసారి కూడా పసర వరకు ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక  పోలీస్ అవుట్ పోస్టు,పసర నుండి మేడారం వరకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అవుట్ పోస్ట్ మరియు మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది గస్తీ కాస్తూ ఉంటారు. 6  టోఇంగ్ వెహికల్స్,11 క్రేన్లు,20 జెసిబిలు ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డు పై నిలిచిన వాహనాలను పక్కకు పెట్టడానికి సిద్ధంగా ఉంటాయి. జాతర  విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి మాస్క్ శానిటైజర్ తో కూడిన కిట్ ఇవ్వనున్నాము.యాభై ముఖ్యమైన ప్రదేశాలలో ప్రజా సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేశాం జాతరకు వచ్చే భక్తులు అందరూ మాస్కులు, శానిటైజర్ వెంట తీసుకొని కోవిడ్ నిబంధనలు పాటించాలి.వాహనదారులందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఓవర్ టెక్ చేయకుండా పోలీసు వారి సూచనలు పాటించి దిగ్విజయంగా అమ్మవార్ల దర్శనం చేసుకొని మీ గమ్య స్థానాలకు క్షేమంగా చేరుకోవాలనికోరుకుంటున్నాం. ట్రాక్టర్లు,ఎడ్లబండ్లు మరియు ఇతర వాహనదారులు అందరూ వాహనం వెనుక వైపు రాత్రిళ్ళు కనిపించే విధంగా రేడియం స్టిక్కర్ ని ఉపయోగించాలి.పోలీసు వారి సూచనలు పాటించాలని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.