జాతిపితకు రాష్ట్రపతి ఘన నివాళి
` ప్రధాని, ప్రముఖుల నివాళి
దిల్లీ(జనంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులు సోమవారం దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీ స్మారకస్థలి వద్ద అంజలి ఘటించారు. భారతీయులతో పాటు పలువురు విదేశీ నేతలు, ప్రతినిధులు కూడా మహాత్ముడి సేవలను గుర్తుచేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఆయనకు నివాళులర్పించారు.’’గాంధీజీ సిద్ధాంతాలు కేవలం ఆలోచనల్లో నుంచి వచ్చినవి కాదు. నిరంతర అభ్యాస ఫలితాలు. ఆయన సిద్ధాంతాల ప్రకారం.. జీవితానికి ఉపయోగపడని తత్వం..’ధూళి లాంటి నిర్జీవమైనదే’. ఆయన మాటలు, చేతలు, ఆలోచనల్లో ఐకమత్యమే స్ఫురించేది. అందుకే నేటికీ ఆయన ఆలోచనలు మనకు ఉపయోగపడుతున్నాయి’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.’’గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆయన బోధనలు మన మార్గాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేస్తూనే ఉంటాయి.యావత్ ప్రపంచంపై ఆయన చెరగని ముద్ర వేశారు. ఐకమత్య స్ఫూర్తి, దయ వంటి గుణాలను మరింత వ్యాప్తి చేసేలా మానవాళిని ప్రేరేపించారు. ఆయన కలలను సాకారం చేసేందుకు మనం కృషి చేద్దాం. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ మన మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని పెంచుకుందాం. యువత కలలను నేరవేరుద్దాం’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సత్యం, అహింస, సామరస్యంతో భారత్‌ను ఏకం చేసే మార్గాన్ని మహాత్మా గాంధీ మనకు చూపించారు. బాపు జయంతి సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.’’చిరస్థాయిగా నిలిచిన గాంధీజీ జీవితం మనల్ని కదిలిస్తుంది. ఆయన అహింసా సందేశం.. ప్రపంచవ్యాప్తంగా సమానత్వం, న్యాయం కోసం ఓ ఆశాజ్యోతిని వెలిగించింది. మార్టిన్ లూథర్ కింగ్, అమెరికా పౌర హక్కుల ఉద్యమంపై గాంధీజీ పెను ప్రభావం చూపించారు. ఆయన ఆదర్శాలకు ఎంత శక్తి ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం ` భారత్‌కు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి