జాతీయ రాజకీయాల కోసమే కేసీఆర్ ప్రధానిని టార్గెట్ చేస్తున్నారు :గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్ జనంసాక్షిః
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. ఢిల్లీ వేదికగా గవర్నర్ తమిళిసై.. తెలంగాణ సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు కురిపించారు.
గవర్నర్ తమిళిసై ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో వరదలపై రాజకీయం చేయడం మంచిది కాదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వచ్చాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాను. నైతిక బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. ఈ క్రమంలోనే వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించాను. కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ.. దేశానికి రాష్ట్రపతి కావడం కేవలం భారత్‌లోనే సాధ్యమైంది. మహిళా రాష్ట్రపతి కింద మహిళా గవర్నర్‌గా పని చేయడం సంతోషంగా ఉందన్నారు.సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు. రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్ కలిసిన తర్వాత కూడా ప్రొటోకాల్‌లో మార్పులేదు. వరదల సమయంలో కలెక్టర్ కూడా రాలేదు. మా మధ్య సంబంధాల్లో ‘స్టేటస్ కో’నే ఉంది. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో నేను పోల్చుకోను. గవర్నర్‌ను కాబట్టి రాజ్‌భవన్‌కే పరిమితం కాను. ప్రజలకు అందుబాటులో ఉండటమే నా లక్ష్యం. నాకు తోచిన రీతిలో వారికి సాయం అందిస్తాను’’ అని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ గవర్నర్ హోదాలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి తమిళిసై హాజరయ్యారు.