జానాకు మరోమారు నిరసన సెగ


నిలదీసిన వ్యక్తులపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేత
నల్గొండ,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ఎన్నికల ప్రచారంలో మరోసారి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగార్జున సాగర్‌ అభ్యర్థి జానారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. నీళ్లు ఇవ్వలేదని అడిగిన ఓ వ్యక్తిపై జానారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురంలో ప్రచారం నిర్వహిస్తుండగా నీళ్లు ఇవ్వలేదని ఓ వ్యక్తి జానాను ప్రశ్నించాడు. కాంగ్రెస్‌ పార్టీ కాకుండా మరే పార్టీ నీళ్లు ఇచ్చిందని జానా ఎదురు ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా జానా కాసేపు ఆవేశంతో ప్రసంగించారు. కొందరు తెరాస కార్యకర్తలు దురుద్దేశంతో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ కెసిఆర్‌ కోవర్టులు తయారయ్యారని మండిపడ్డారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కట్టిన తర్వాత మంచినీళ్లు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. సత్యనారాయణపురంలో పాఠశాల ఎవరు కట్టించారు? విద్యుత్‌ ఎవరు ఇచ్చారు? సీసీ రోడ్లు ఎవరు వేయించారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవన్నీ కెసిఆర్‌ ఇచ్చారా అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా తానపే ఇవన్నీ చేశానని అన్నారు.