జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్టు
మెదక్ : కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న కొండపాక, తొగుట మండలాల్లో బాధితులను కలిసి పరామర్శించేందుకు జానారెడ్డి, షబ్బీర్‌అలీ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వారిని మార్గ మధ్యంలో మెదక్ జిల్లా రాజీవ్ రహదారిపై ములుగు మండలం ఒంటిమామిడి వద్ద సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్సీపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో 16 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించడం లేదని, సర్వం కోల్పోతున్న వారికి పరిహారం ఇవ్వడంతో పాటు మరో చోట వారికి భూమి, నివాస సౌకర్యం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఈనెల 26న ‘చలో మల్లన్నసాగర్’ కార్యక్రమం చేపట్టారు. గాంధీ భవన్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను అక్కడే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి మల్లన్నసాగర్ బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు.