జాయింట్‌ వీల్‌ ప్రమాద ఘటనలో ఇద్దరు అరెస్ట్‌

– నిర్వహణ లోపం వల్లే ప్రమాదం
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకట్రావు
అనంతపురం,మే29(జ‌నం సాక్షి): అనంతపురం ఎగ్జిబిషన్లో ఆదివారం సాయంత్రం జాయింట్‌ వీల్‌ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన  ప్రమాద ఘటనకు సంబంధించి ఇద్దరిని మంగళవారం  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ వెంకట్రావు వివరాలను వెల్లడించారు. ఈనెల 27వ తేదీన అనంతపురం నగరంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో జాయింట్‌ వీల్‌ తిరుగుతుండగా ఓ బుట్టకు ఉన్న బోల్టు విరిగిపోయి కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు జాయింట్‌ వీల్‌ యంత్రం పాతది కావడం, నిర్వహణ సరిగా లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. రఘ అనే వ్యక్తి ఏడేళ్ల క్రితం ఈ యంత్రాన్ని హైదరాబాద్‌లో కొనుగోలు చేసి పలు ఎగ్జిబిషన్లలో ఏర్పాటు చేస్తున్నాడు. ఆపరేటర్‌గా ఉన్నమహదేవ్‌ యంత్రం నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. దీంతో జాయింట్‌ వీల్‌ యజమాని రఘుతోపాటు, ఆపరేటర్‌ మహదేవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకట్రావు చెప్పారు. ఈ సందర్భంగా యన ఎగ్జిబిషన్‌ నిర్వాహకులకు తగు సూచనలు ఇచ్చారు. ఎగ్జిబిషన్‌లో చిన్నారులను తిప్పే పరికరాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని సూచించారు. ఏ చిన్న ప్రమాదం జరిగిన చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని, అలా కాకుండా షోలు నిర్వహించే ప్రతి సారి పరికరాలను పరీక్షించుకున్న తరువాతనే షోలు నిర్వహించాలని సూచించారు.