జాలర్ల విషయాన్ని తేలికగా తీసుకోం: భారత్‌

న్యూఢిల్లీ,మార్చి7:  భారత జాలర్లను శ్రీలంక అకారణంగా అరెస్టు చేసి తీసుకువెళ్లిన ఘటనపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోబోమని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ విూడియాతో అన్నారు. భారత్‌-శ్రీలంక ఇలాంటి సున్నిత అంశాల్లో స్నేహపూర్వకంగా చర్చించుకోవల్సిన అవసరం ఉందన్నారు. శ్రీలంక నుంచి భారత జాలర్లను విడిపించే విషయమై త్వరలోనే లంక ఉన్నతాధికారులతో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ చర్చిస్తారని చెప్పారు. కొద్ది రోజుల్లో మోదీ శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన జాలర్ల అంశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. గత రెండు నెలల్లో వందమందికి పైగా భారత జాలర్లను శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.