జిఎస్టీ పన్నుల రేట్ల హేతుబద్దీకరణ

సూచన ప్రాయంగా వెల్లడించిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ,జూన్‌8(జ‌నం సాక్షి): జిఎస్టిపై వస్తున్న విమర్శలు, నిరసనల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లు తగ్గే అవకాశముందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. త్వరలోనే దీనిపై కీలక ప్రకటన వెలువడనున్నట్లు వెల్లడించారు. భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఆధ్వరంలో దిల్లీలో ఓ కార్యక్రమం జరిగింది. దీనిపై హాజరైన శుక్లా.. జీఎస్‌టీ గురించి ప్రస్తావించారు. ‘జీఎస్‌టీ రేట్లను హేతుబద్ధీ కరించే దిశగా జీఎస్టీ మండలి చర్యలు చేపట్టింది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేయనుంది’ అని శుక్లా తెలిపారు. అన్ని రకాల వస్తువులను, సేవలను ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చేందుకు గతేడాది జులైలో కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. వస్తువులు, సేవలపై 5, 12, 18, 28 శాతం పన్నులు విధిస్తోంది. అయితే జీఎస్‌టీ విధానాన్ని సరళీకరించాలని, రేట్లను తగ్గించాలని సీఐఐ సహా పలు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాగా.. ఈ ఏడాది జనవరిలో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో 54 సేవలు, 29 వస్తువులపై జీఎస్‌టీని తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు 2017 నవంబరులో జరిగిన సమావేశంలోనూ 28శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులను కింది శ్లాబులకు తగ్గించారు.