జిమ్మిక్కులు మానండి.. కొనుగోలు చేయండిపత్తి రైతుల డిమాండు
అదిలాబాద్, జనవరి 16 (ఎపిఇఎంఎస్): జిల్లాలో పత్తి కొనుగోలులో అడుగడుగునా ఎదురవుతున్న అవరోధాల వల్ల పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ సాంకేతిక కారణాలు చూబుతూ తరచుగా కొనుగోళ్లను నిలిపేస్తుండడంతో రైతులు తమ పత్తి పంటను ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సిసిఐ కొనుగోళ్లు చేపడుతున్నప్పటికీ మాటి మాటికి కొనుగోళ్లు నిలిపేస్తోంది. కొనుగోలు ప్రారంభంలో వారానికి ఆరు రోజుల పాటు కొనుగోలు చేస్తుండగా గత నెల నుంచి వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు నిరసన తెలుపుతున్నారు. మళ్లీ బుధవారం నుంచి పత్తి కొనుగోలును నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన పత్తితో గోదాములు నిండిపోవడంతో స్థలం లేక నిలిపేస్తున్నట్టు తెలియజేసింది. సిసిఐ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. తరచుగా సిసిఐ కొనుగోలు నిలిపేస్తుండడంతో రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు క్వింటాలు రూ.3,300కే అమ్ముకుంటుండగా అదే పత్తిని వ్యాపారస్తులు 3,900 రూపాయలకు సిసిఐకి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో సిసిఐ అధికారులు ప్రైవేటు వ్యాపారస్తులతో కుమ్మక్కవుతున్నారని ఆరోపణలు వస్తున్నా.. జిల్లా యంత్రాంగం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటివరకు మొత్తం 11.66 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరగ్గా.. ఇందులో 6 లక్షల క్వింటాళ్లకు పైగా ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేయగా.. సిసిఐ 5.66 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.3,900 ధర నిర్ణయించగా.. సిసిఐ చేస్తున్న జిమ్మిక్కులకు వ్యాపారస్తులు లాభపడుతుండగా.. రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరాటంకంగా పత్తిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.