జిల్లాకు కోటి నిధులు విడుదల

కొత్త పంచాయితీల అభివృద్దికి కేటాయింపు

కొత్తగూడెం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తండాలను పంచాయతీలుగా మార్చడంతో నూతన పంచాయతీలతో పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా కొత్త పంచాయితీల ఏర్పాటు ధూంధాంగా సాగింది. ప్రజాప్రతినిధులు పంచాయితీలను ప్రారంభించారు. జిల్లాలోని 479 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులతో పాలన సాగించేందుకు అధికారుల యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. గ్రామస్థుల భాగస్వామ్యంతో నూతన గ్రామపంచాయతీల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించామని జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి ఆర్‌ఏఎస్‌పీ లత తెలిపారు. నూతన గ్రామ పంచాయతీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన ఏర్పాటు చేస్తున్నామన్నారు.కొత్త పంచాయతీల అభివృద్ధి కోసం జిల్లాకు రూ.కోటి నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు జరిగే దాకా కొత్త పంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేందుకు ఈ నిధులను కేటాయించనున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు కేటాయించినప్పటికీ అదనంగా కొత్త పంచాయతీలకు మరో రూ.కోటి నిధులను కేటాయించడంతో ఎన్నికల లోపు పంచాయతీల్లో అభివృద్ధి వేగవంతం కానుంది. దీంతో కొత్త పంచాయతీల్లో పరిపాలన ప్రజలకు చేరువకానుంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలలో పంచాయతీ కార్యాలయాలను ఏర్పాటు చేసామని, స్వీపర్లు, ఎలక్టీష్రియన్లు, వాచ్‌మెన్లు, బిల్‌ కలెక్టర్లు వంటి సిబ్బందిని అవసరానికి అనుగుణంగా ఆయా గ్రామాలకు కేటాయించామని అన్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీల పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే వాటి పరిధి, జనాభాకు అనుగుణంగా ఆస్తుల పంపిణీ పూర్తి చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటికే 92 మంది కార్యదర్శులు ఉండగా, 182 పంచాయతీలకు వీరు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. 274 కొత్తపంచాయతీలకు కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో కార్యదర్శుల నియామకం చేపట్టామన్నారు.ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో 274 గ్రామపంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసామని అన్నారు. దీంతో గ్రామస్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల సంఖ్యకు అనుగుణంగా నూతన క్లస్టర్లు ఏర్పడనున్నాయి. దీంతో కొత్త గ్రామపంచాయతీల పరిధిలో మారునున్నాయి. స్పెషల్‌ ఆఫీసర్లుగా 176మందిని లోని ఎంపీడీఓలు, ఈఓలు, ఈఓపీఆర్డీలు, ఏఓ, తహసీల్‌దార్లను ప్రత్యేక అధికారులుగా నియమించి పాలనను కొనసాగించనున్నారు. పాత పంచాయతీల్లో ఉన్న సిబ్బందిని కొత్త పంచాయతీలకుఅనుగుణంగా విభజించారు.