జిల్లాలో జోరుగా హరితహారం

ఉత్సాహంగా మొక్కలు నాటిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): జిల్లా వ్యాప్తంగా హరితహారం మొక్కల పెంపకం చురకుగా సాగింది. ఎమ్మెల్యేలు,అధికారులు, సింగరేణి అధికారులు మొక్కలు నాటి లక్ష్యశుద్దిని ప్రదర్శించారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు నాల్గోవిడత హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో జోరుగా చేపట్టారు. పొలాలు, చేలగట్లపై, చెరువు కట్టలపై ఎక్కువ మొత్తంలో టేకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల్లో మొక్కల పెంపకంపై ఆసక్తిని పెంచేందుకు అటవీ, విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలూనిర్వహించారు. హరితహారంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఇక నుంచి మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను విద్యార్థులకే అప్పగించేందుకు ప్రణాళికలు రూపొందించామరు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మూడు లక్షల మొక్కలు ఇప్పటికే నాటారు. మైదానాలుగా మారిన అటవీ ప్రాంతాలను గుర్తించి మొక్కలు విస్తృతంగా నాటేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలోని ప్రతీ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని మొత్తం 479 పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. జిల్లాలో ఇప్పటికే మొత్తం 65 నర్సరీలుండగా, వీటిలో అటవీ, ఐటీడీఏ, హార్టికల్చర్‌, డీఆర్‌డీఏ ద్వారా మొక్కలు పెంచుతున్నారు. ప్రభుత్వ స్థలాలు లేని జీపీల్లో ప్రైవేటు స్థలాలను కూడా తీసుకొని అద్దె చెల్లించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. పంచాయతీల్లోని జనాభా ఆధారంగా ఆయా పంచాయతీలే నర్సరీల పర్యవేక్షణ చేస్తాయన్నారు. నర్సరీలను, హరితహారంలో నాటిన మొక్కల రక్షణ బాధ్యతను పంచాయతీలే చూసుకుంటాయి. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎస్పీ అంబర్‌కిషోర్‌ ఝాతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరితహారంలో రైతులకు, గృహస్తులకు అన్ని రకాల మొక్కలను ఉచితంగా ఇస్తున్నారు. మామిడి, కొబ్బరి మొక్కలను కూడా ఉచితంగా అందిస్తారు. ఈ మొక్కలను తీసుకున్న వారు బాధ్యతతో సంరక్షించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సింగరేణి, ఇతర పరిశ్రమలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. నాల్గో విడతలో జిల్లాలో 95 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో ఇప్పటికే అటవీశాఖ భూముల్లో 33 లక్షల మొక్కలు నాటినట్లు కలెక్టర్‌ హన్మంతు చెప్పారు. మూడు విడతల్లో జిల్లాలో సుమారు 4.5 కోట్ల మొక్కలు నాటగా, వాటిలో సుమారు 3.9 కోట్ల మొక్కలు రక్షించామన్నారు.స్థానిక సంస్థల నుంచి అన్ని స్థాయిల్లో మొక్కలను పెంచేందుకు ప్రధానంగా ఎక్కడైతే ప్రహరీ గోడలు, రక్షణ పరమైన సౌకర్యాలు ఉంటాయో అక్కడ ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటితే ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ దిశగా ప్రతీఒక్కరూ ఆలోచన చేయాలని కలెక్టర్‌ సూచించారు.